‘అరుదైన రాజనీతిజ్ఞుడిగా సీఎం జగన్‌ నిలిచారు’

31 Oct, 2020 15:30 IST|Sakshi

ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి నవంబర్‌ 6కి మూడేళ్లు

నవంబర్‌ 6 నుంచి పార్టీ తరఫున 10రోజులపాటు కార్యక్రమాలు

ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకుంటాం: సజ్జల

సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్‌ 6 నుంచి వైఎస్సార్‌సీపీ తరపున వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రజలకు ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అనేది వారి నుంచి తెలుకుంటామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. . దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేశారన్నారు. 14 నెలల పాటు ప్రజల్లో ఉంటూ 3,640 కిలో మీటర‍్ల దూరం నడిచారని గుర్తుచేశారు. తనకు తానే ఒక మార్పుకు నాంది పలుకుతూ.. ఈ రోజు దేశంలోనే అరుదైన రాజనీతిజ్ఞుడిగా సీఎం జగన్‌ నిలిచారని ప్రశంసించారు. చీకటి తర్వాత తొలిపొద్దు పొడిచినట్లు రాష్ట్రం ముందడుగు వేసిందన్నారు. అందుకే నవంబర్‌ 6 నుంచి పార్టీ తరపున కార‍్యక్రమాలు రూపొందిస్తున్నట్లు సజ్జల వివరించారు.

‘సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలను 90శాతం అమలు చేశారు. సంక్షోభాలను తట్టుకొని ఒక ధీశాలిగా ప్రభుత్వాని నడిపించారు. పరిపాలనను వికేంద్రీకరించి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి ముందుకు పరిపాలన తెచ్చారు. గతంలో రేషన్‌ కార్డు నుంచి ఏది కావాలన్నా సమయం దొరికేది కాదు కానీ, ప్రస్తుతం సంతృప్తి స్థాయిలో నిర్ణీత సమయంలో సేవలు అందుతున్నాయి. సంక్షేమ నగదు నేరుగా లబ్దిదారుని ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇవన్నీ సీఎం జగన్‌ తపన, నిబద్దత వల్లే సాధ్యమవుతున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు రూ.2.60 లక్షల కోట్ల అప్పులు, మరో 60 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌ పెట్టారు. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయింది అనే ప్రశ్న తలెత్తింది.

ఇన్ని సమస్యలను ఎదుర్కొని వైఎస్ జగన్ పారదర్శకత, జవాబుదారీ తనం తెచ్చారు. ఇంగ్లీష్ మీడియం చదువు కొనుక్కోడానికి పేదలు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. సీఎం జగన్‌ మన పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అని భావించారు. నాడు నేడు కింద స్కూల్ ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మీరే చూస్తున్నారు. కానీ  టీడీపీ నేతలు అన్నిటికీ కోర్టులకు వెళ్లి స్టే తెస్తున్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి చేద్దాం అనే ధోరణి నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఫలితాలు అందిస్తున్నాం. మహిళలకు మేము పెద్ద పీట వేశాము అని గర్వంగా చెప్పగలం. అన్నింటిలో వారికి 50 శాతం స్థానం కల్పించాం. ఆస్పత్రులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందబోతున్నాయి.16 కొత్త మెడికల్ కాలేజీ లు వస్తున్నాయి. ఏడాదిన్నరలోనే ఇవన్నీ చేసిన సందర్బంగా మా పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అనేది వారి నుంచి తెలుసుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం’ అని సజ్జల పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా