పవన్‌ దగ్గరే మహిళలకు రక్షణ లేదు 

3 Jul, 2022 03:45 IST|Sakshi

మహిళలను పెళ్లి చేసుకుని వదిలేసే నీచ సంస్కృతి పవన్‌ది 

మహిళల రక్షణపై పవన్‌ మాట్లాడితే దుశ్శాసనుడు, కీచకుడు మాట్లాడినట్లే ఉంటుంది 

సీఎం జగన్‌ మహిళల అభివృద్ధికి ఎంతో చేస్తున్నారు 

వైస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత

సాక్షి, అమరావతి: ‘సినిమాకు ఓ హీరోయిన్‌తో రెండు పాటల్లో పిచ్చి గెంతులేసినట్లు.. నిజ జీవితంలో కూడా మహిళలను వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి పవన్‌ కళ్యాణ్‌ది. ముగ్గురిని పెళ్లి చేసుకుని, వదిలేసి, వారి జీవితాలతో చెలగాటమాడారు’ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. వ్యక్తిగత జీవితంలో మహిళలను గౌరవించని నీకు.. మహిళల భద్రత, రక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సునీత మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే మహిళలకు ఆయన ఏమాత్రం గౌరవం ఇస్తారో అర్థమవుతుందన్నారు. ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్‌.. ఇప్పుడు ఇంకొకరితో పెళ్లికి పవన్‌ కళ్యాణ్‌ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది అని చెప్పారు.  దుశ్శాసనుడు, కీచకుడు మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో.. మహిళల రక్షణ గురించి పవన్‌కళ్యాణ్‌ మాట్లాడితే అలాగే ఉంటుందని అన్నారు. నిజానికి పవన్‌కళ్యాణ్‌ దగ్గరే మహిళలకు రక్షణ లేదని చెప్పారు. 

హోం మంత్రి మాటలను వక్రీకరిస్తారా? 
‘రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని.. పిల్లలకు బ్యాడ్‌ టచ్‌ గురించి తల్లిదండ్రులు, టీచర్లు అవగాహన కల్పించాలని హోం మంత్రి అన్న మాటలను పవన్‌ కళ్యాణ్‌ వక్రీకరిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. అప్పుడు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్,  ఎమ్మార్వో వనజాక్షిపై దాడి వంటి ఎన్నో అమానవీయ సంఘటనలు జరిగినా ఎందుకు ప్రశ్నించలేదు’ అని నిలదీశారు. 

మహిళా పక్షపాతి సీఎం వైఎస్‌ జగన్‌ 
‘పొరుగు రాష్ట్రంలో ఒక యువతి దారుణ హత్యకు గురైతే, ఆమె పేరుతో ఇక్కడ మహిళల రక్షణ కోసం సీఎం జగన్‌ ప్రత్యేకంగా దిశ యాప్‌ రూపొందించారు. దిశ చట్టాన్ని రూపొందించారు. యాప్‌ను దాదాపు 1.50 కోట్ల మంది మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అది వారికి ఎంతో రక్షణ కల్పిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ మహిళా పక్షపాతి. ఈ మూడేళ్లలో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా ఎంతో కృషి చేశారు. మహిళ అభివృద్ధి చెందితేనే ఆ ఇల్లు, ఊరు, రాష్ట్రం బాగుంటాయని నమ్మారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు.

డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు వారిని మోసం చేస్తే, జగన్‌ వారిని ఆదుకుంటున్నారు. వారి రుణాలు చెల్లించడంతో పాటు, సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత వంటి పథకాలతో పాటు, బాలికల కోసం కూడా స్వేచ్ఛ పథకం అమలు చేస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్‌  ప్రాధాన్యం ఇస్తున్నారు.

సచివాలయాల్లో 55 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నారు. అన్ని నామినేటెడ్‌ పోస్టుల్లో కూడా వారికి 50 శాతం ఇస్తున్నారు’ అని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికార దర్పంతో వ్యవహరిస్తోందని పవన్‌ ఆరోపించడం విడ్డూరమన్నారు. వైఎస్‌ జగన్‌ పభుత్వం పూర్తి సేవాభావంతో పని చేస్తోందని చెప్పారు. పవన్‌కళ్యాణ్‌ ఇలాగే మాట్లాడుతూ పోతే 2024 ఎన్నికల్లో మహిళలే ఆయనకు బుద్ధిచెబుతారని హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు