ఇళ్ల స్థలాలు అడ్డుకుంటున్నది టీడీపీ నేతలే

3 Oct, 2020 11:47 IST|Sakshi
శ్రీరామవరంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

 హెల్త్‌ సెంటర్, 5 గ్రామ సచివాలయాల నిర్మాణాల నిలుపుదలకూ కుట్ర

ఆధారాలు బట్టబయలు చేసిన వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, దెందులూరు: రామారావుగూడెం పంచాయతీ మలకచర్లలో 71 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా కోర్టులో వ్యాజ్యం వేసి అడ్డుకున్నది టీడీపీకి చెందిన పర్వతనేని వెంకటరామారావు అని వైఎస్సార్‌ సీసీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి నాని, వైఎస్సార్‌ సీపీ నాయకులు పేర్కొన్నారు. శ్రీరామవరంలో వారు విలేకరులకు వివరాలు తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని, కోర్టులో కేసు వేసిన వ్యక్తికి, టీడీపీకి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు మంగళవారం విలేకరులకు తెలిపారన్నారు. అయితే ఆ వ్యాజ్యం వేసిన వెంకటరామారావు టీడీపీకి చెందిన వ్యక్తి అనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని చూపించారు. మలకచర్లలో హెల్త్‌ సెంటర్‌ నిర్మాణం, మేదినరావుపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పెదవేగి మండలంలో ఐదు గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలను నిలిపివేయాలని కోర్టులో వ్యాజ్యం వేయటాన్ని వారు తప్పు పట్టారు.

వైద్యశాల విషయంలో కూడా రాజకీయం చేస్తారా? అని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో తనపై తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గంలో దుర్మార్గమైన పాలన చేశారు కాబట్టే నియోజకవర్గ ప్రజలందరూ వ్యతిరేకించి చింతమనేనిని ఇంటికి పరిమితం చేశారని నాని పేర్కొన్నారు. అయినా తీరు మార్చుకోకుండా టీడీపీకి వందల ఓట్ల మేరకు తక్కువ పడిన గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందకుండా చేసేందుకు ఏదొక సాకుతో కోర్టుల్లో వ్యాజ్యాలు వేయిస్తున్న తీరును నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ల్యాండ్‌ పూలింగ్, ఫిల్లింగ్‌కు వ్యత్యాసం తెలియని వారంతా ఉన్నత విద్యను అభ్యసించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని విమర్శించటం చూసి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి గంగాధరబాబు, పార్టీ సీనియర్‌ నాయకుడు కామా కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు