హెరిటేజ్‌ దోపిడీ వెలుగు చూస్తుందనే టీడీపీ పరార్

5 Dec, 2020 04:34 IST|Sakshi

టీడీపీ వైఖరిపై వైఎస్సార్‌ సీపీ సభ్యుల ధ్వజం

అమూల్‌పై చర్చకు సిద్ధమైన ప్రభుత్వం

ఉపాధి బిల్లుపై చర్చ జరగాలన్న విపక్షం

స్పీకర్‌ స్థానం వద్ద రగడ.. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు

సస్పెండ్‌ చేయకున్నా వెళ్లిపోయిన బాబు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాదిమంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే అమూల్‌ సహకార సంస్థ అంశం శుక్రవారం శాసనసభలో చర్చకు రాకుండా ప్రతిపక్ష టీడీపీ విశ్వప్రయత్నం చేసింది. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుపై తామిచ్చిన వాయిదా తీర్మానంపైనే చర్చ జరగాలని ఆ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. టీడీపీ పాలనలో ఈ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతున్నందున చర్చకు అనుమతించలేమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేసినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు.

ఈ వైఖరిపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అమూల్‌ అంశం చర్చకొస్తే చంద్రబాబునాయుడికి సంబంధించిన హెరిటేజ్‌ మోసాలు వెలుగుచూస్తాయని టీడీపీ భయపడుతోందని విమర్శించారు. ఈ కారణంగానే సభ నుంచి పారిపోయేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అందుకే సభ్యులను స్పీకర్‌ వెల్‌లోకి పంపి గొడవ చేయిస్తన్నాడని ధ్వజమెత్తారు. ఒకసారి వాయిదాపడ్డ సభ మళ్లీ ప్రారంభంకాగానే టీడీపీ సభ్యులు ఏకంగా స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టడమే కాకుండా, స్పీకర్‌ స్థానం వైపు దూసుకెళ్లి దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. 

సస్పెన్షన్‌ బాధ కలిగిస్తోంది
ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో విపక్ష సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్‌ చేశారు. సస్పెండైన వారిలో చంద్రబాబునాయుడు లేకపోయినా ఆయన సభనుంచి వెళ్లిపోవడాన్ని వైఎస్సార్‌ సీపీ సభ్యులు తప్పుబట్టారు. ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అతి ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా విపక్షం రాజకీయ కోణంలో వెళ్లడం హేయమైన చర్య అని అభివర్ణించారు.

స్పీకర్‌ స్థానం వద్దకు రావడం బాధాకరమన్నారు. సస్పెండ్‌ చేసిన తర్వాత తానెంతో మనోవేదనకు గురవుతున్నానని, నిద్ర కూడా పట్టడం లేదని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో సస్పెండ్‌ చేయాల్సి వస్తోందన్నారు. మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన్ని మోస్తున్న ఎల్లో మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల వచ్చినప్పుడు కూడా ఎల్లో మీడియా తనను కేంద్రంగా చేసుకుని తప్పుడు వార్తలిచ్చిందని చెప్పారు.   

మరిన్ని వార్తలు