ట్యాపింగ్‌ కాదది.. రికార్డింగే 

3 Feb, 2023 04:46 IST|Sakshi

జరగని ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లుగా చిత్రీకరిస్తూ చంద్రబాబు కుట్ర 

జాతీయ సమస్యగా దానిపై పోరాటం చేసే స్థాయికి దిగజారిన వైనం 

ఈ కుట్రలో కోటంరెడ్డి పాత్రధారి : వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి   

వైఎస్సార్‌సీపీ లేకుంటే ఎమ్మెల్యే అయ్యేవాడివా? : మంత్రి పెద్దిరెడ్డి   

ఇది నమ్మకద్రోహం : మాజీ మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రాజకీయం చేయడానికి ఏ సమస్యా లేకపోవడంతో జరగనే జరగని ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు చిత్రీకరించి.. దానిని జాతీయ సమస్యగా సృష్టించి, పోరాటం చేసే స్థాయికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిగజారారు. ఈ కుట్రలో కోటంరెడ్డి పాత్రధారి. ఇందులో భాగంగా కోటంరెడ్డి ప్రభుత్వంపై బురద చల్లి పార్టీ వీడాలనుకోవడం దారుణం.

ఇంతకూ రికార్డ్‌ చేసింది కోటంరెడ్డి మిత్రుడే’ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యుత్, అటవీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. గురువారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 

టీడీపీ రాజకీయ లబ్ధి కోసమే.. 
‘నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ సంభాషణను ఆయన మిత్రుడే రికార్డింగ్‌ చేసి.. అందరికీ పంపారు. బయట సర్క్యులేట్‌ అవుతున్న ఆ ఆడియో క్లిప్‌ను ఇంటెలిజెన్స్‌ అధికారి కోటంరెడ్డికి  పంపి, సరి చూసుకోవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమయ్యాక.. 2024లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పిన మాటల ఆడియో కూడా సర్క్యులేట్‌ అవుతోంది.

చంద్రబాబుతోనూ లోకేశ్‌తోనూ కోటంరెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి ఉంటే.. చంద్రబాబుతో కోటంరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మేం అప్పుడే గుర్తించేవాళ్లం కాదా? టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా చంద్రబాబు.. మా ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని.. దానిపై న్యాయస్థానంలో కేసు కూడా వేశాం. వాళ్లలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు రాజకీయ లబ్ధి కోసం టీడీపీ కుట్ర పూరితంగా చిత్రీకరిస్తోంది.’  
– సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు

టీడీపీలో చేరే వారు బావిలో దూకినట్లే 
‘ఇష్టం లేనివారు టీడీపీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. కానీ ప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీపై బురదజల్లాలనుకోవడం సమంజసం కాదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని స్థాపించకపోతే నీలాంటి వాళ్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేవారా? కోటంరెడ్డి ఆరోపిస్తున్నట్లుగా అది ఫోన్‌ ట్యాపింగ్‌ కానే కాదు.

ఆయన మిత్రుడే రికార్డ్‌ చేశారన్న విషయం కోటంరెడ్డికి కూడా తెలుసు. ఇదంతా చంద్రబాబు కుట్ర. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు సీఎం వైఎస్‌ జగన్‌ భయపడరు. టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే. కోటంరెడ్డిలాంటి వాళ్లు వెళ్లినా వైఎస్సార్‌సీపీకి వచ్చే నష్టమేమీ ఉండదు. లోకేశ్‌ పాదయాత్ర టీడీపీకి గుదిబండగా మారుతుంది.’
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్, అటవీ, గనుల శాఖ మంత్రి     

డిసెంబర్‌ 25న బాబును కలిశారు 
‘నీ ఫోన్‌ సంభాషణను నీ మిత్రుడు రామశివారెడ్డి రికార్డ్‌ చేసి, అందరికీ పంపారు. అది బయట సర్క్యులేట్‌ అవుతుంటే..  ఇంటెలిజెన్స్‌ అధికారి దాన్ని నీకు వాట్సాప్‌లో పంపి.. సరి చూసుకోవాలని సూచించడంలో తప్పేముంది? ఇది వాస్తవం కాదంటే.. నీ ఫోన్‌కు సంబంధించి గత ఆర్నెల్ల వాట్సాప్‌ డేటాను బహిర్గతం చేయగలవా? కోటంరెడ్డిని సీఎం జగన్‌ ఎంతగానో నమ్మితే.. ఇలా నమ్మక ద్రోహానికి పాల్పడటం తగదు.

డిసెంబర్‌ 25న బ్లూ కలర్‌ బెంజ్‌ కారులో చంద్రబాబు ఇంటికి కోటంరెడ్డి వచ్చి.. రెండు గంటలపాటు మాట్లాడి వెళ్లారు. ఇదివరకటిలాగే మాజీ మంత్రి నారాయణతో సంబంధాలు కొనసాగించాలని బాబు చెప్పారు. లోకేశ్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. పాదయాత్రకు ముందు లోకేశ్‌ సలహాలు కూడా అడిగారు. కోటంరెడ్డి ఆస్పత్రిలో ఉన్నప్పుడు లోకేశ్‌ ఫోన్‌ ద్వారా పరామర్శించారు అని టీడీపీ నేతలు, కోటంరెడ్డి  పక్కనున్న వారే చెబుతున్నారు.’            
– పేర్ని నాని, మాజీ మంత్రి    

మరిన్ని వార్తలు