ఆ రూ.52 వేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారు?

6 Aug, 2020 18:31 IST|Sakshi

చంద్రబాబుకు పార్థసారథి సూటి ప్రశ్న

సాక్షి, తాడేపల్లి : తన ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు కానీ అమరావతిలో ఉన్న ఆస్తులే తనకు ముఖ్యమనే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నారని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. అమరావతిలో ఉద్యమాన్ని నడిపిస్తున్నవారంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులని ఆరోపించారు. వాళ్లంతా అమరావతి మీద ప్రేమతో కాకుండా వ్యాపారం కోసం ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధికి  తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధే తమకు ముఖ్యమమని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆ 52 వేల కోట్ల రూపాలయను ఎక్కడ ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
(చదవండి : 'ఏం చెప్పారో చంద్రబాబుకే తెలియదు')

 అద్భుతమైన రాజధాని నిర్మిస్తానంటూ అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. రాజధాని భూములను ఇష్టానుసారంగా తన బినామీలకు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధికి చెందినదని కేంద్ర స్పష్టం చేసినా.. టీడీపీ నేతలు బుద్ధిలేకుండా ఇంకా కేంద్రం జోక్య చేసుకోవాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మతి భ్రమించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని విమర్శించారు. అమరావతిపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని పార్థసారథి సవాల్‌ విసిరారు. (చదవండి : ఉన్నత విద్యపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు