‘అక్రమాలకు వాళ్లు అన్నదమ్ములు’

4 Oct, 2020 12:15 IST|Sakshi

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: అక్రమాలకు చంద్రబాబు అన్నయ్య అయితే.. సబ్బం హరి తమ్ముడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. సబ్బం హరిని పొలిటికల్‌ బ్రోకర్‌గా ఆయన అభివర్ణించారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రూ.3 కోట్ల విలువైన భూమిని సబ్బం హరి కబ్జా చేశారని దుయ్యబట్టారు. అధికారులు అనేక సార్లు నోటిసులు ఇచ్చినా సబ్బం హరి స్పందించలేదని.. ఆయన నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు అంటించారని తెలిపారు. అక్రమంగా భూములు దోచేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. ‘‘విశాఖలో ఒక సెంట్‌ భూమి కూడా కబ్జా కానివ్వం. ప్రభుత్వ భూములను అక్రమదారుల చేతుల్లోకి వెళ్లనివ్వమని చాలా సార్లు చెప్పాం. చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖలో భారీ భూ స్కామ్ జరిగింది. విశాఖలో భూ స్కామ్‌లు జరిగాయని టీడీపీ నేతలే ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ భూములను కాపాడతామని’’ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. (చదవండి: చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..)

‘‘సబ్బంహరి 213 గజాలు ఆక్రమిస్తే తప్పులేదు.. అధికారులు తొలగిస్తే తప్పని చంద్రబాబు అండ్‌ కో అంటున్నారు. 200 గజాలు కాదు కదా.. 2 గజాలు కూడా కబ్జా కానివ్వం. చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషియన్‌, సబ్బంహరి బ్లాక్‌మెయిల్‌ పొలిటిషియన్‌. దోపిడీలు, అక్రమాల్లో సీనియార్టీని బట్టి టీడీపీలో పదవులు ఇస్తారు. హత్యకేసులో నిందితుడు రవీంద్రకు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే, ఈఎస్‌ఐ స్కామ్‌లో డబ్బు మింగేసిన అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. దోపిడీలు, అక్రమాల్లో సీనియార్టీని బట్టి టీడీపీలో పదవులు ఇస్తారని’’ ఆయన ఎద్దేవా చేశారు. విశాఖ ప్రజలు సబ్బం హరికి రాజకీయ భిక్ష ఇస్తే.. వారిని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తప్పు చేస్తే మాజీ ఎంపీ అయినా.. మేయర్ అయినా తమకు ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డిలను విమర్శించే స్థాయి సబ్బం హరికి లేదని, ఇకనైనా సబ్బంహరి తన భాష మార్చుకోవాలని అమర్‌నాథ్‌ హెచ్చరించారు. (చదవండి: మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా)


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా