బాబు ఇంట్లో చర్చిద్దామా?

17 Aug, 2020 04:02 IST|Sakshi

టీడీపీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ సవాల్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తుంటే తట్టుకోలేకే విమర్శలు

సాక్షి, అమరావతి: అణగారిన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి తట్టుకోలేక టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

► ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటివరకు 4 లక్షల ఉద్యోగాల్లో 82.5 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అవకాశం కల్పించారు. కేవలం 14 నెలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.60 వేల కోట్లు వెచ్చించారు.
► ఈ వర్గాల  సంక్షేమంపై చర్చకు మేం సిద్ధం. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సవాలును స్వీకరిస్తున్నాం. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి రమ్మన్నా వస్తాం. 
► సీఎం జగన్‌ పాలనలో అందరికీ నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దేశం అంతా ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటోంది. మనసున్న మనిషి కావడం వల్లే పవన్‌ అభిమానికి కూడా సీఎం రూ.10 లక్షలు సాయం చేస్తున్నారు.
► అసలు రాష్ట్రంలో టీడీపీ ఉందా? ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందా? అనే సందేహం కలుగుతోంది. 
► అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు, హత్యా రాజకీయాలను ప్రేరేపించిన కొల్లు రవీంద్రలు మాత్రమే టీడీపీకి గుర్తుకొస్తున్నారా?
► తన హయాంలో ఎస్టీ, మైనార్టీలకు ఆఖరి వరకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబుకు వారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? 
► రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గౌరవంగా తలెత్తుకుని తిరిగేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తుంటే అడ్డుకునేందుకు టీడీపీ యత్నిస్తోంది.
► ఏపీలో చీఫ్‌ మినిస్టర్‌ టు.. కామన్‌మెన్‌ (సీఎం టు సీఎం) విధానంలో నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం జగన్‌ సాకారం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు