రైతుల పాదయాత్ర పేరుతో రాజకీయ యాత్ర

12 Nov, 2021 04:35 IST|Sakshi

ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు..

ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

సాక్షి, అమరావతి: రాజధానిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. శాసన రాజధానిగా అమరావతి ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసమే మూడు రాజధానులపై సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ రాజకీయ యాత్ర చేస్తోందని.. యాత్ర పూర్తిగా పసుపుమయమై సాగుతోందని దుయ్యబట్టారు. బినామీల మేలు కోసమే చంద్రబాబు తాపత్రయం అని.. ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబుకు ఇంకా బుద్ధిరాలేదని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు చంద్రబాబు నిరంతరం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం తప్పా? అని ప్రశ్నించారు. స్థానికంగా మద్దతు లేకపోవడంవల్లే పాదయాత్రకు ఇతర ప్రాంత నేతలను తరలిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో అలజడికి చంద్రబాబు కుట్ర
ఇది పాదయాత్ర కాదని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై దాడి అని సుధాకర్‌బాబు అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా అలజడి సృష్టించేందుకే బాబు కుట్ర చేస్తున్నారని.. ఆయన విషకౌగిలిలో, అమాయకులైన రైతులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్నారన్నారు. అసలు ఈ పాదయాత్ర ద్వారా ఏం జరుగుతుందనే విషయాన్ని సంతనూతలపాడు నియోజకవర్గంలో చూశామని తెలిపారు.

చదవండి: కుప్పంలో కొత్త నాటకం.. టీడీపీ సానుభూతి డ్రామా

పేద ప్రజల బాగు కోసం జగన్‌ ఆరాటం
నిజానికి.. చంద్రబాబు తన బినామీల భూముల కోసం ఆరాటపడుతుంటే, సీఎం జగన్‌ పేద ప్రజల బాగు కోసం తపన పడుతున్నారని చెప్పారు. బాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పోరాటం చేస్తుంటే, ముఖ్యమంత్రి జగన్‌ అన్ని ప్రాంతాలకు సమానమైన న్యాయం జరిపించేందుకు పోరు సల్పుతున్నారన్నారు. అమరావతి ప్రాంతంలోని గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లను ప్రజలు వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టారని.. అయినా చంద్రబాబుకు ఇంకా సిగ్గు రాకపోవడం దురదృష్టకరమని ఆయనన్నారు. 
చదవండి: టీడీపీ తప్పుడు ప్రచారం.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ

మరిన్ని వార్తలు