అహంకారపూరిత వైఖరి.. నిమ్మగడ్డపై ఆగ్రహం

9 Jan, 2021 11:04 IST|Sakshi

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేల ధ్వజం

సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని మండిపడ్డారు. ఇందులో కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు
‘‘కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఈ ఎన్నికల షెడ్యూల్‌ వెనక కుట్ర కోణం ఉంది’’ అని మంత్రి కన్నబాబు అన్నారు.

ఇక నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వడమేంటి. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం’’ అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ రమేష్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు.  వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా’’ అని మండిపడ్డారు.(చదవండి: సుప్రీం కోర్టు, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్‌)

నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. 

ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఇక నిమ్మగడ్డ ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నట్లు ఉందని కరణం ధర్మశ్రీ విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేశారు.  అనంత వెంకటరామిరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభ్యర్థనను ఎస్‌ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను కాదని నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు