బినామీల పేరిట లోకేష్‌ కోట్లు కొల్లగొట్టారు..

15 Sep, 2020 14:01 IST|Sakshi

చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై వైఎస్సార్‌ సీపీ నేతల విమర్శలు

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు రైతులు, దళితుల భూములను దోచుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేశారని, దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఆర్‌డీఏ అంటే చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలా మారిపోయిందని.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించలేదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని అక్రమాలపై విచారణకు సిద్ధపడాలని సవాల్‌ విసిరారు.(చదవండిఅమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు

కాగా అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. ఈ విషయంపై స్పందించిన వైఎస్సార్‌ సీపీ నేతలు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం
టీడీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. చట్టాలను సైతం ఉల్లంఘించి భూ కుంభకోణానికి పాల్పడ్డారని.. చంద్రబాబు, లోకేష్‌ తమ నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే విచారణకు సహకరించాలని చాలెంజ్‌ విసిరారు.

ఫైబర్‌గ్రిడ్‌ కుంభకోణంపై విచారణ జరగాలి
కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణలో రాజధాని అక్రమాలు బయటపడ్డాయని ఎమ్మెల్యే రోశయ్య స్పష్టం చేశారు. సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదైందని, తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్‌గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు.

లోకేష్‌ కోట్లు కొల్లగొట్టారు
అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుంటే కక్షసాధింపు అంటున్నారని, అందుకే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఫైబర్‌గ్రిడ్‌లో లోకేష్ తన బినామీలతో కోట్లు కొల్లగొట్టారని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు.

సీబీఐ విచారణ జరిపించాలి
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని, చంద్రబాబు, టీడీపీ నేతలు విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు