ప్రధాని మోదీతో కలిసి సీఎం జగన్‌ విశాఖలో పర్యటిస్తారు.. ఈ విషయం ఓర్చుకోలేకే..

29 Oct, 2022 13:49 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'విశాఖ పరిపాలనా రాజధానిపై టీడీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 11,12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖలో పర్యటించి సీఎం జగన్‌తో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. దీనిని టీడీపీ నాయకులు సహించలేకపోతున్నారు. ఉత్తరాంద్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ నాయకులు ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబు ఆడమన్నట్లు ఆడి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. రుషికొండ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్ట్ కడుతుంటే తప్పు ఏంటి?.

పర్యావరణం అనేది కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొండలపై నిర్మాణాలు చెయ్యలేదా. టీడీపీ నాయకులు ఉత్తరాంద్ర ప్రాంతాన్ని దోచుకున్నారు. ఇరిగేషన్ భూములను కబ్జా చేసిన అయ్యన్నపాత్రుడు భూకబ్జాల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇల్లే కరకట్టను ఆక్రమించి కట్టుకున్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను చెడగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. సీఎం జగన్ గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేకంగా సెబ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో సీఎం జగన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు' అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు