ఏపీ పట్ల ఎందుకింత పక్షపాతం

19 Jul, 2021 03:01 IST|Sakshi
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత మిథున్‌ రెడ్డి తదితరులు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను అఖిలపక్ష సమావేశం సాక్షిగా వైఎస్సార్‌సీపీ ఎండగట్టింది. అధికారంలోకి రావడానికి ఎంతకైనా దిగజారతారా అని ప్రశ్నించింది. ఏపీ పట్ల అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, సవతితల్లి ప్రేమ, మొండిచెయ్యి చూపడం మానుకోవాలని హితవు పలికింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి సమయం ఇవ్వకపోతే ప్రొటెస్ట్‌ చేయడానికి వెనకాడబోమన్నారు. అనంతరం విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

29 నెలలుగా పోలవరం పునరావాస ప్యాకేజీ పెండింగ్‌ 
పోలవరం సాగునీటి ప్రాజెక్టు పునరావాసం పరిహారం ప్యాకేజీ 29 నెలలుగా పెండింగ్‌లో ఉందని విజయసాయిరెడ్డి మీడియాతో చెప్పారు. ‘రాష్ట్రానికి రూ.55,657 కోట్లు ఇవ్వకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోంది. సాంకేతిక అనుమతులిచ్చినా పెండింగ్‌లో ఉంచడం రాష్ట్రానికి ద్రోహం అనడంలో సందేహం లేదు. విశాఖ ఉక్కు దేశ ఆస్తి. దాన్ని అమ్మే అధికారం ప్రభుత్వానికి ఉండదు. విశాఖ ఉక్కుపై తాము చేసిన 3 సూచనలు అమలు చేయకపోతే.. ఏదైనా ప్రభుత్వరంగ సంస్థలో విలీనం చేయాలని కోరాం. 

8 ఏళ్లయినా విభజన హామీలు నెరవేరలేదు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వడంపై సమావేశంలో ప్రస్తావించాం. ఇటీవల పుదుచ్చేరి ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా చేర్చారు. ఇదెలా సాధ్యం? అధికారంలోకి రావడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. విభజన చట్టం అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లయినా చాలా హామీలు నెరవేరలేదు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరాం. బియ్యం రాయితీ రూ.5,056 కోట్లు, ఉపాధి నిధులు రూ.6,750 కోట్లు వెంటనే విడుదల చేయాలని, వంశధార ట్రిబ్యునల్‌ తీర్పును గెజిట్‌ నోటిఫై చేయాలని, పెండింగ్‌లో ఉన్న దిశ బిల్లు వెంటనే క్లియర్‌ చేయాలని కోరాం.

2016 నుంచి 2018 వరకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు తెలంగాణ నుంచి ఏపీకి రూ.6,112 కోట్లు రావాలని, ఆ రాష్ట్రం చెల్లించని నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పాం. సీఆర్‌డీఏ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్, లక్ష్మీనరసింహస్వామి రథం కాలిపోవడం అంశాలపై సీబీఐ విచారణ కోరినా కేంద్రం స్పందించలేదని గుర్తుచేశాం. పీఎం ఆవాస్‌ యోజన కింద మౌలిక వసతుల ఏర్పాటు నిమిత్తం రూ.11 వేల కోట్లు ఇవ్వాలని కోరాం. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్‌ 11 నెలలుగా పెండింగ్‌లో ఉంచారు. బీజేపీకి అనుకూలంగా ఉండేవారిపై చర్యలు తీసుకోవడానికి సభాపతి వెనకంజ వేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రవాణి వినిపిస్తాం
వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో చాలా విషయాలు అమలు కాలేదని సమావేశంలో స్పష్టం చేశామన్నారు. ఆయా అంశాలపై మాట్లాడడానికి సమయం ఇవ్వడంతోపాటు స్వల్పకాలిక చర్చకు అనుమతి ఇవ్వాలని డిమాండు చేసినట్లు తెలిపారు. ఉపాధిహామీ, పోలవరం, ఇతర ప్రాజెక్టుల నిధులకు సంబంధించి చర్చ జరగాలని కోరామన్నారు. ఏ ఒక్క అంశాన్ని వదలబోమని, ఉభయసభల్లో రాష్ట్ర వాణి వినిపిస్తామని ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు