‘పోలవరం ప్రాజెక్ట్‌కు తక్షణమే రూ. 55వేల కోట్లు ఇవ్వాలి’

19 Jul, 2021 14:00 IST|Sakshi

పోలవరం ప్రాజెక్ట్‌ అంశం మీద లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి.. పోలవరం ప్రాజెక్ట్‌ అంశం మీద లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

‘‘పోలవరం ప్రాజెక్ట్‌కు జీవం పోసింది వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి. అన్ని అనుమతులు తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌దే. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోలవరంకు 55వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి. 29 నెలలు గడిచినా ఇంకా పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించలేదు. పోలవరం ప్రాజెక్టు ఆఫీస్‌ను రాజమండ్రికి తరలించాలి’’ అని కోరినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు తెలిపారు. 

ఏపీ ప్రయోజనాల కోసం పని చేస్తాను: గురుమూర్తి
‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు, తిరుపతి ప్రజల దీవెనలతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాను. ఏపీ ప్రయోజనాలను సాధించేందుకు పని చేస్తాను. విభజన హామీల అమలు కోసం ప్రతి నిమిషం పోరాడుతాం’’ అన్నారు తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి.

మరిన్ని వార్తలు