భూ దోపిడీపై నిగ్గు తేల్చండి

21 Sep, 2020 03:58 IST|Sakshi
ఆదివారం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీలు

పార్లమెంట్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ ఎంపీల ధర్నా

అమరావతి భూముల్లో భారీ అక్రమాలు

సొంత మనుషులకు చంద్రబాబు పందేరం

సీబీఐతో దర్యాప్తు జరిపి నిజాలు వెలికి తీయాలి  

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో రాజధాని అమరావతిలో వేల ఎకరాల భూ దోపిడీకి పాల్పడటంపై సీబీఐతో దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. పార్టీ ఎంపీలు ఆదివారం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నానిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వల్లభనేని బాలశౌరి, బీవీ సత్యవతి, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, కోటగిరి శ్రీధర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్‌ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

రూ.40 వేల కోట్లకుపైగా దోపిడీ: ఎంపీ కోటగిరి శ్రీధర్‌
► ప్రతి ఇంటికీ పథకాల లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 15 నెలలుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా పాలనను సామాన్యుడి చెంతకే చేర్చింది. మేం రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచాం. వైఎస్సార్‌సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. ప్రజలంతా మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు. 
► 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏపాటిదో ఇప్పుడు కనబడుతోంది. ఆ అనుభవం మతవిద్వేషాలను రెచ్చగొడుతోంది. బీజేపీలో ఉన్న తన సన్నిహితులతో రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నారు. అమరావతిలో 4 వేల ఎకరాలను తన సొంత మనుషులకు, అప్పటి అడ్వొకేట్‌ జనరల్‌కు, జడ్జిల కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. భూముల కుంభకోణంలో రూ. 40 వేల కోట్ల మేర దోపిడీ జరిగింది. ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయి? ఎక్కడ కొన్నారు? రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని సీబీఐ దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలి.
► చంద్రబాబు అధికారంలో ఉండగా వైఎస్సార్‌సీపీ నుంచి ముగ్గురు ఎంపీలను తీసుకెళితే ఎన్నికల్లో ఆయనకు ముగ్గురే మిగిలారు. వచ్చే ఎన్నికల్లో మీకు ఒక్క ఎంపీ మాత్రమే మిగులుతారు. 
► రికార్డు స్థాయిలో వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధించి అత్యధిక సీట్లు గెల్చుకున్నా.. ప్రతి విషయానికి కోర్టులు అడ్డుపడుతున్నాయి. వైఎస్సార్‌ సీపీ సామాన్యుడి కోసం పుట్టిన పార్టీ. అభివృద్ధి పనులతో ప్రజల మనసులను గెలుచుకుంటాం. 

ప్రజలు అంతా గమనిస్తున్నారు: మోపిదేవి వెంకట రమణారావు
► అమరావతిలో భూముల అక్రమాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో నిలదీశారు. వీటిని వెలుగులోకి తెచ్చేందుకు అధికారంలోకి వచ్చాక కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించారు. దర్యాప్తుల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. 
► వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలియకూడదని సాక్షాత్తూ న్యాయస్థానం నిబంధన విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతవరకు సమంజసం? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే స్టే, సామాన్యుడు ఇంగ్లిష్‌ అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తే దానిపై స్టే, రాజధాని భూముల కుంభకోణంపై దర్యాప్తుజరగకుండా స్టే.. ఇలా ఏ పనిచేసినా స్టే వస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు.  

తప్పు చేయబట్టే అడ్డుకుంటున్నారు: వల్లభనేని బాలశౌరి
చంద్రబాబు మొదటి నుంచి వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ బతుకుతున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి అన్ని స్కాముల్లో ఇదే వైఖరి. ఏ తప్పు చేయనప్పుడు, దర్యాప్తు నిలిపివేయమని అడగాల్సిన పని ఏముంది? తప్పు చేశారు కాబట్టే అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎన్నో రోజులు కుదరదు. రాష్ట్ర ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. దర్యాప్తు జరిపే వరకు పార్లమెంటులో నిరసన వ్యక్తంచేస్తూనే ఉంటాం.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా