టీడీపీ గుర్తింపు రద్దుచేయాలి 

3 Nov, 2021 05:11 IST|Sakshi
రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

రాష్ట్రపతికి వైఎస్సార్‌సీపీ ఎంపీల వినతి 

పట్టాభి వ్యాఖ్యలు చెబితే ఆయన ఆశ్చర్యపోయారు 

ఎంపీ విజయసాయిరెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గుర్తింపు రద్దుచేయాలని, ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తూ దురుద్దేశపూర్వకంగా అవమానించే చర్యలకు పాల్పడితే కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్ట్స్‌ యాక్ట్, 1971 తరహాలో చట్టం తీసుకురావాలని కేంద్ర న్యాయమంత్రిని ఆదేశించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్, పట్టాభిరామ్‌ తదితరులు వాడుతున్న అసభ్య, నీచమైన పదజాలాన్ని రాష్ట్రపతికి వివరించారు. అనంతరం ఎంపీలు మార్గాని భరత్‌రామ్, సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, రెడ్డెప్ప, బీవీ సత్యవతిలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు రాష్ట్రపతిని కలిసి టీడీపీ నేతలు వాడుతున్న భాష, ఆచరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు వివరించాం.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాజ్యాంగ విరుద్ధంగా ఎలాంటి భాష ఉపయోగిస్తున్నారో చెప్పాం. తప్పుచేసి చంద్రబాబు రాష్ట్రపతి దగ్గరకువెళ్తే.. చంద్రబాబు ఏ రకంగా తప్పుచేశారో వివరించడానికి మేం రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాం. రాష్ట్ర పరువు, ప్రతిష్ట, ప్రజల ఆత్మగౌరవం చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో రాష్ట్రపతికి వివరించాం. టీడీపీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా మాట్లాడుకునేది బూతు భాష. ఇతరులను సంబోధించేది కూడా బూతు భాషతోనే. అందుకే టీడీపీ అనడం కన్నా తెలుగు బూతుల పార్టీ అనడం సమంజసంగా ఉంటుంది. రాష్ట్రపతికి బోషడీకే అనే పదాన్ని ఎలా వివరించాలో అర్థంగాక ఎంతో సతమతమయ్యాం. చివరకు ఆయన అర్థం చేసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అంటేనే సంస్కారవంతమైన పార్టీ. టీడీపీ సంస్కారహీనమైన పార్టీ.

పట్టాభి వ్యాఖ్యలు ఖండించడం లేదంటే చంద్రబాబును సంస్కారహీనుడు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. టీడీపీ అధికార ప్రతినిధి వాడిన పదం చంద్రబాబు రాష్ట్రపతికి చెప్పారా అని మరోసారి అడుగుతున్నాం. రెండున్నరేళ్లుగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్న చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోయింది. అందుకే టీడీపీ నేతలు బూతు భాష వాడుతున్నారు. టీడీపీ అతి త్వరలోనే అంతర్థానం కాబోతోంది. అందుకే ఆ పార్టీ నేతలు యాంటీసోషల్‌ ఎలిమెంట్స్‌గా, టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రతిష్ట మంటగలుపుతున్నారు. టీడీపీ చేస్తున్న పిచ్చిపిచ్చి పనులన్నీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం..’ అని విజయసాయిరెడ్డి చెప్పారు. కాగా, బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ సాధించిన విజయం రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతమని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం బద్వేలు విజయం అని ఆయన పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు