Rajya Sabha: ఆర్‌.కృష్ణయ్యకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సీటు.. ‘బాబు యవ్వారం విడ్డూరంగా ఉంది’

21 May, 2022 13:00 IST|Sakshi

ముషీరాబాద్‌ (హైదరాబాద్‌): తమది బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకునే తెలు గుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. ఆర్‌.కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థిత్వంపై కుట్రలకు తెరలేపడం ఆయన స్థాయికి తగదని పలు బీసీ సంఘాలు ధ్వజమెత్తాయి. గత 4 దశాబ్దాలుగా బీసీల హక్కుల సాధనకు ఉద్యమాలే ఊపిరిగా జీవితం గడుపుతున్న ఆర్‌.కృష్ణయ్యను.. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయిస్తే చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వారు దుయ్యబట్టారు. కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికైతే బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ దూరం అవుతారోననే భయంతోనే చంద్రబాబు విషం కక్కుతున్నారని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. 

శుక్రవారం జాతీ య బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్‌ గుజ్జకృష్ణ, ఏపీ యూత్‌ అధ్యక్షుడు బోన్‌ దుర్గానరేశ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌కోటితోపాటు పలు సం ఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలకు ఏనాడూ న్యా యం చేయలేదని, బీసీల పట్ల కపట ప్రేమను ఒలకపోశారని మండిపడ్డారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్‌. కృష్ణయ్యను ప్రకటించిన చంద్రబాబు, ఆ తరువాత టీడీపీ శాసన సభా పక్ష నేతగా ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 70 శాతం పదవులు కేటాయిస్తే చంద్రబాబుకు కుళ్లు ఎందుకని ప్రశ్నించారు. కృష్ణయ్యపై విమర్శలు చేస్తే తెలుగుదేశం పార్టీ మరింత దిగజారడం ఖాయమని అన్నారు. ఆర్‌.కృష్ణయ్య నాయకత్వంలో బీసీలంతా జగన్‌మోహన్‌రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటారని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు