కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్‌సీపీ రెపరెపలు 

17 Jul, 2022 09:14 IST|Sakshi
పార్టీలో చేరిన కుప్పం నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

టీడీపీ నుంచి భారీగా వలసలు

మొన్న 100 మంది, నేడు 234 మంది చేరికలు

అభివృద్ధి చూసే చేరామంటున్న ‘తమ్ముళ్లు’ 

సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరొందిన కుప్పంలో ఆ పార్టీ బీటలువారుతోంది.  ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి వెన్ను విరిగింది. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జగనన్న సంక్షేమ పాలనకు ఆకర్షితులైన ఆ పార్టీ శ్రేణులు భారీగా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వం, స్థానిక నాయకుడు ఎమ్మెల్సీ భరత్‌ ఆధ్వర్యంలో పని చేసేందుకు టీడీపీ ‘తమ్ముళ్లు’ క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఉనికి కుప్పంలో ప్రశ్నార్థకమవుతోంది.
చదవండి: అచ్చెన్నాయుడు ఆడియో కలకలం

జిల్లాలోనే కుప్పం నియోజవర్గం కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ కోటకు బీటలు వారాయి. ఇప్పుడు క్రమంగా ఆ కోట కాస్తా కూలుతోంది. నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో 100 మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. వీరందరూ ఈనెల 5వ తేదీన తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా శనివారం చిత్తూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మరో 234 మంది పార్టీలో చేరారు. అందరికీ వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి ఆహా్వనించారు. ఇక మున్ముందు ఇదే తరహాలో ప్రతి గ్రామం నుంచి భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీలోకి వలసలు ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. 

గుడికి అని చెప్పి తీసుకోలేదు  
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 234 మంది పార్టీ కండువా వేసుకున్నారు. సీఎం జగన్‌ చేసిన మంచి కార్యక్రమాలు, మంత్రి పెద్దిరెడ్డి మీద నమ్మకంతో టీడీపీకి గుడ్‌బై చెప్పేసి, వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే టీడీపీ తరహాలో మేము గుడికి అని తీసుకెళ్లి పార్టీ కండువాలు కప్పలేదు. ఇప్పుడు మల్లారం నుంచి 156 మంది స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి ఇదొక గుణపాఠం.
– భరత్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు  

కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం
చంద్రబాబు సీఎంగా అనేక సార్లు ఉన్నా కుప్పం అభివృద్ధి జరగలేదు. అలాంటి కుప్పంపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. కుప్పంలో బీసీలు ఎక్కువ. సీఎం జగన్‌ బీసీలకు పెద్దపీట వేశారు. ఈసారి బీసీ అభ్యర్థి భరత్‌ను తప్పక గెలిపిస్తాం.  
– మురుగేష్‌, కుప్పం వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌

టీడీపీలో మేలు జరగలేదు 
30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాను. ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. నన్ను కనీసం గుర్తించలేదు. కానీ, జగనన్న సీఎం అయ్యాక సంక్షేమ పథకాల ద్వారా నాకు లక్షకుపైగా నగదు అందింది. అందుకే ఈ పార్టీలో చేరాను.  
– కుప్పన్, మల్లనూరు మాజీ వార్డు సభ్యుడు  

37 ఏళ్లుగా టీడీపీలో ఉన్నా 
టీడీపీలో 37 సంవత్సరాలుగా ఉన్నాను. గతంలో ఎంపీటీసీగా పోటీ చేశాను. కానీ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక చేపట్టిన అభివృద్ధి పనులు నచ్చా యి. ఆయన వల్ల కుప్పం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉంది. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరాను.
– నారాయణస్వామి   

మరిన్ని వార్తలు