లోక్‌సభలో బాబు అరెస్ట్‌ వ్యవహారం లేవనెత్తిన టీడీపీ.. వైఎస్సార్‌సీపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

18 Sep, 2023 18:05 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన వ్యవహారం పార్లమెంట్‌ను తాకింది. ముందస్తు ప్లాన్‌లో భాగంగా ప్రత్యేక సమావేశాల్లో సోమవారం టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్‌ను హైలైట్‌ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు సైతం గట్టి కౌంటరే ఇచ్చారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని, ఇందులో చంద్రబాబు ప్రమేయం నిరూపితమైందని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.   

స్కిల్‌ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, ఆ అరెస్ట్‌ ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని,  ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా స్పందించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. ఆ సమయంలో వైసీపీ  ఎంపీ మిధున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసులో చోటు చేసుకున్న పరిణామాలను లోక్‌సభకు వివరించారాయన. 

ఇది పూర్తిగా అవినీతి కేసు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం పూర్తి ఆధారాలతో నిరూపితం అయ్యింది.  రూ.371 కోట్ల లూటీ జరిగింది. అన్ని ఆధారాలు ఉన్నందునే ఆయన అరెస్ట్‌ జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబు అవినీతిని..  స్టేల ద్వారా తప్పించుకుంటూ రాగలిగారు. చిట్టచివరకు చంద్రబాబు చట్టానికి చిక్కారు. ఐటీ కేసులో చంద్రబాబు సైతం నోటీసులు అందుకున్నారు. చంద్రబాబు పీఏకు సైతం ఐటీ నోటీసు ఇవ్వగా.. ఆయన విదేశాలకు పారిపోయారు.  ఈ కేసులో దోచిన మొత్తాన్ని 80 షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేలిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. 

అయితే.. మిథున్ రెడ్డి ప్రసంగాన్ని మధ్యలో టీడీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోర్టులో ఉన్న సమయంలో సభలో చర్చ సరికాదని అభిప్రాయపడ్డారు. కోర్టులో విచారణలో ఉన్న ఈ అంశం పైన సభలో చర్చకు అనుమతించనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు