భయం భయంగా టీడీపీ 

25 Aug, 2022 04:33 IST|Sakshi

ప్రశ్నార్ధకంగా చంద్రబాబు, లోక్‌శ్‌ జీవితాలు 

వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న జనాదరణ 

తాజా సర్వేలన్నీ సీఎం జగన్‌ వైపు మొగ్గు 

జూ.ఎన్టీఆర్‌ బీజేపీకి మద్దతుదారుగా మారతాడనే భయంలో టీడీపీ ఉంది 

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి 

సాక్షి, అమరావతి: ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ఉత్సాహంతో ముందుకు సాగుతుందని, దానికి భిన్నంగా రాష్ట్రంలో టీడీపీ భయం భయంగా గడుపుతోందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ చలి జ్వరం వచ్చిన పిల్లల్లా వణికిపోతున్నారని, వారి జీవితాలు ప్రశ్నార్ధకంగా మారాయని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పంలో ఓడిపోవడం ఖాయమనే స్థితికి చంద్రబాబు వచ్చారన్నారు.

మంగళగిరిలో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్సీ ఎం.హనుమంతరావు సూర్యోదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలతోనే ఉంటూ లోకేశ్‌కు సూది మోపేంత అవకాశం కూడా ఇవ్వడంలేదని చెప్పారు. టీడీపీ రథసారధులకే ప్రజాదరణ లేదని, పార్టీ లేదు బొక్కా లేదన్న అచ్చెన్నాయుడి మాట ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి బాగా వెళ్లిందన్నారు. పాలక పక్షమైన వైఎస్సార్‌సీపీకి రోజురోజుకు అనూహ్యంగా జనాదరణ పెరుగుతోందని, తాజాగా అనేక సర్వేలు ప్రజలు సీఎం జగన్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు. దీంతో చంద్రబాబు, టీడీపీ నేతలు గందరగోళంలో పడిపోయారన్నారు.

ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మిత్రపక్షం ఏదీ లేక దిక్కులు చూడటం చంద్రబాబు, లోకేశ్‌ల ఫుల్‌ టైం వ్యాపకంగా మారిందన్నారు. హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర హోంమంత్రి పర్యటన టీడీపీలో, ఆ పార్టీ అగ్రనేతల్లో మరింత అయోమయాన్ని నింపిందన్నారు. ఈ బీజేపీ మంత్రి ఓ మీడియా గ్రూపు అధిపతి ఇంటికి వెళితే అది వారికి అనుకూల పరిణామమని పచ్చ చొక్కాల పార్టీ నేతలు, కార్యకర్తలు అనుకున్నారని తెలిపారు.

కేంద్రంలోని పాలకపక్షం అండ దొరుకుతుందని ఆశపడ్డారని చెప్పారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు కేంద్ర మంత్రిని కలవడానికి ఆహ్వానం అందితే ఇదే పసుపపచ్చ శిబిరం కంగారు పడిపోయిందని తెలిపారు. ఎక్కడ ఈ యువ హీరో బీజేపీకి మద్దతుదారుగా మారిపోతాడోననే భయం టీడీపీని చుట్టుముట్టిందని చెప్పారు.   

మరిన్ని వార్తలు