AP MPP Election: వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యం

25 Sep, 2021 03:52 IST|Sakshi

621 ఎంపీపీ పదవులు వైఎస్సార్‌సీపీ కైవసం

సొంతంగా ఐదు ఎంపీపీలను దక్కించుకున్న టీడీపీ

జనసేన మద్దతుతో మరో రెండు..

ఒక్కో చోట జనసేన, సీపీఎం.. నాలుగు చోట్ల స్వతంత్రుల గెలుపు

వాయిదా పడిన చోట నేడు తిరిగి ఎన్నికలు

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ.. శుక్రవారం మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్ష పదవులకు నిర్వహించిన ఎన్నికల్లోనూ పూర్తి ఆధిక్యత సాధించింది. రాష్ట్రంలోని 660 మండలాల్లోని 11 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. మిగతా 649 మండలాలకు శుక్రవారం ఎంపీపీ అధ్యక్ష పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కోరం లేకపోవడం, నామినేషన్‌లు వేయకపోవడం వల్ల 15 మండలాల్లో ఎన్నికను వాయిదా వేశారు. ఎంపీపీ ఎన్నిక నిర్వహించిన 634 మండలాల్లో 621 ఎంపీపీ అధ్యక్ష పదవులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

టీడీపీ ఐదు చోట్ల సొంతంగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు చోట్ల జనసేన మద్దతుతో మొత్తంగా ఏడు ఎంపీపీలకే పరిమితమైంది. జనసేన, సీపీఎం ఒక్కో ఎంపీపీ పదవిని దక్కించుకోగా.. నాలుగు చోట్ల స్వతంత్రులు ఆ పదవులను చేజిక్కించుకున్నారు. కాగా, 639 మండలాల్లో కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, 619 మండలాల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వాయిదా పడిన మండలాల్లో తిరిగి నేడు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఎంపీపీ రెండో ఉపాధ్యక్ష పదవి!
మండలాల్లోనూ రెండో ఉపాధ్యక్ష పదవిని కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి శుక్రవారం ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది.

 

మరిన్ని వార్తలు