ప్రజాసమస్యలు నేను చూపిస్తా

21 Oct, 2021 02:59 IST|Sakshi
బుధవారం చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల 

లేకపోతే ముక్కు నేలకు రాసి ఇంటికెళ్లి పోతా

ఉంటే కేసీఆర్, కేటీఆర్‌ రాజీనామాలు చేస్తారా?

దమ్ముంటే నాతో పాదయాత్రకు రండి

మీరు చేసిన అభివృద్ధి చూపించండి

ప్రజాప్రస్థానం ప్రారంభోత్సవ సభలో షర్మిల

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌ తెలంగాణ అంతా ఎంతో సుభిక్షంగా ఉందని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని పదేపదే చెబుతున్నారు. నేను పాదయాత్రకు వెళ్తున్నా..దమ్ముంటే నాతో కలిసి పాదయాత్రకు రండి. చేసిన అభివృద్ధిని మీరు చూపించండి. ప్రజా సమస్యలను నేను చూపిస్తా. మీరు చెప్పినట్లు తెలంగాణలో ప్రజా సమస్యలే లేకపోతే..నా ముక్కు నేలకురాసి, ఇంటికెళ్లిపోతా. అదే సమస్యలున్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి కేసీఆర్, మంత్రి పదవికి కేటీఆర్‌ రాజీనామా చేస్తారా?..’ అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

బుధవారం చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరుతో మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యల కు, హత్యలకు కేసీఆర్, ఆయన కుటుంబమే కారణమని ఆరోపించారు. 


పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ షర్మిల. చిత్రంలో వైఎస్‌ విజయమ్మ తదితరులు 

నిధులు ఆయన ఇంటికి : ‘దివంగత నేత వైఎస్సార్‌ హయాం లో రూ.33 వేల కోట్ల అంచనాతో రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసం రీడిజైన్‌ చేసి, లక్షా 33 కోట్లకు పెంచారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు కేసీఆర్‌ ఇంటికెళ్లగా..నీళ్లు ఆయన ఫాంహౌస్‌కు, నియామకాలు ఆయన కుటుంబసభ్యులకు వెళ్లాయి. ప్రజా సంక్షేమ పథకాలు, సమగ్ర అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా పాదయాత్రను ప్రారంభిస్తున్నా..’ అని షర్మిల చెప్పారు.  

కేసీఆర్‌ చేతిలో రేవంత్‌ పిలక 
‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమానికి పాటు పడుతున్న కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ అరువు తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్‌ చేతిలో ఉంది. ఆయన రాహుల్‌ మాట వినక పోయినా..కేసీఆర్‌ మాట వినితీరాల్సిందే. కేసీఆర్‌ అవినీతి చిట్టా చేతిలో ఉందంటూ బీజేపీ అధినేత బండి సంజయ్‌ పదేపదే చెబుతున్నారు. ఆధారాలు ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదు? తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే. వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దు..’ అని షర్మిల హెచ్చరించారు.

అంతకుముందు ఉదయం 11.30 గంటలకు తల్లి విజయమ్మ సహా షర్మిల సభావేదికపైకి చేరుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం తొలుత విజయమ్మ, ఆ తర్వాత షర్మిల మాట్లాడారు. అనంతరం విజయమ్మ పాదయాత్రను ప్రారంభించి, షర్మిలను ఆశీర్వదించారు. కాగా ఎర్రోనికోటాల, కందవాడ, నారాయణదాసుగూడల మీదుగా చేవెళ్ల–మెయినాబాద్‌ శివారులోని నక్కలపల్లి బస కేంద్రానికి సాయంత్రం 7.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. తొలిరోజు మొత్తం పది కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

అప్పగిస్తున్నా.. ఆశీర్వదించండి: విజయమ్మ 
పాదయాత్ర ప్రారంభ సభలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ మాట్లాడారు. ‘చేవెళ్లకు మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. దివంగత నేత వైఎస్సార్‌ పాదయాత్ర సహా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు కూడా ఈ గడ్డ నుంచే ప్రారంభించారు. ఆయన అడుగులో అడుగు వేసేందుకు, ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఆయన రక్తం పంచుకుపుట్టిన బిడ్డ షర్మిలను మీకు అప్పగిస్తున్నా. మీరంతా ఆమెకు అండగా నిలవండి. ఆశీర్వదించండి..’ అని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు