నేను వైఎస్సార్‌ వదిలిన బాణాన్ని: షర్మిల 

26 Sep, 2022 01:39 IST|Sakshi
సంగారెడ్డి అంబేడ్కర్‌ చౌరస్తాలో  మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తాను బీజేపీ, టీఆర్‌ఎస్‌ వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణలో సంక్షేమ పాలన కోసం వైఎస్సార్‌ వదిలిన బాణాన్ని అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఎందుకు పెట్టినట్టు అని కాంగ్రెస్‌ నేతలు అనడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ నేతలు వారి పార్టీ కథలు వారు చూసుకోవాలని హితవు పలికారు.

ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో జరిగిన బహిరంగసభలో షర్మిల మాట్లాడారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాదని, ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న మోసగాడని విరుచుకుపడ్డారు. రుణమాఫీ, వడ్డీలేని రుణాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో దక్షిణ భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.

బంజారాహిల్స్‌ బాలికపై అత్యాచారం చేసిన ఎమ్మెల్యేల కొడుకులు, మంత్రి మనవళ్లపై చర్యలు లేవని మండిపడ్డారు. బీడి బిచ్చం.. కల్లు ఉద్దెర అన్న చందంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపైనా షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. ఈ కేసులో చిప్పకూడు తిన్న రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్‌ చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయ స్వార్థం కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని షర్మిల విమర్శించారు. 

మరిన్ని వార్తలు