YS Sharmila: ఆ హామీలేవీ నెరవేర్చలేదు

6 Feb, 2023 04:29 IST|Sakshi

కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

వరంగల్, హనుమకొండలో సాగిన ప్రజాప్రస్థానం పాదయాత్ర

ఖిలా వరంగల్‌/హనుమకొండ చౌరస్తా: పేదలకు డబుల్‌బెడ్రూం, ఇంటికో ఉద్యోగం, ఎస్సీలకు మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, ఉచితంగా ఎరువులు, 57 ఏళ్లకే పింఛన్, ముస్లిం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ అంటూ సీఎం కేసీఆర్‌ వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి ప్రజల కోసం పనిచేయండి.. చేసిన తప్పులను సరిదిద్దుకోకుంటే ప్రజలు తరమికొట్టడం ఖాయమని అన్నారు.

ఆదివారం ఉదయం 10 గంటలకు వరంగల్‌ నక్కలపెల్లి శివారులో ప్రారంభమైన షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ములుగు రోడ్డు వద్ద హనుమకొండ జిల్లాలోకి ప్రవేశించి హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌ వరకు చేరుకుంది. వరంగల్‌–నెక్కొండ రోడ్డుపై రహమత్‌నగర్‌ వద్ద షర్మిల విలేకరులతో మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచితవిద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఊసేలేదని, ఆరోగ్యశ్రీ పథకాన్ని కోమాలో పెట్టారని విమర్శించారు.

సీఎం కుటుంబంలోని ఐదుగురికి పదవులిచ్చుకోవడమే సంక్షేమ పాలనా అన్ని ఎద్దేవా చేశారు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 65 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్‌ఎస్‌ రెండోసారి పగ్గాలు చేపట్టాక 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలను పక్కనబెట్టి నిరుద్యోగం లేదని బుకాయిస్తోందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే యువకుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయో మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు.  

మరిన్ని వార్తలు