YS Sharmila: పాదయాత్రను, పార్టీని ఆపడం ఎవరితరం కాదు 

3 Dec, 2022 02:37 IST|Sakshi

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టీకరణ 

ఈ నెల 4 నుంచి తిరిగి పాదయాత్ర కొనసాగిస్తానని వెల్లడి 

తన పాదయాత్రకు రక్షణ కల్పించాలని డీజీపీ ఆఫీసుకు.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న తన పాదయాత్రను టీఆర్‌ఎస్‌ గూండాలు అడ్డుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల దుయ్యబట్టారు. అయితే తన పాదయాత్రను, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరి తరం కాదని తేల్చిచెప్పారు. ఈ నెల 4వ తేదీ నుంచి తన పాదయాత్రను ఆగిన చోటు (వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం) నుంచే తిరిగి ప్రారంభిస్తున్నానని, ఈ నెల 14 వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

రాష్ట్రంలో పోలీసులు కేవలం అధికార పార్టీకి మాత్రమే మిత్రులుగా ఉంటున్నారని... ప్రతిపక్షాలపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అయినప్పటికీ వారు అలా వ్యవహరించడం లేదని విమర్శించారు. తన పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరడానికి శుక్రవారం డీజీపీ కార్యాలయానికి పార్టీ నేతలు గట్టు రాంచందర్‌రావు, పిట్టా రాంరెడ్డి తదితరులతో కలసి వచ్చిన షర్మిల... డీజీపీ లేకపోవడంతో అదనపు డీజీకి వినతిపత్రం అందచేశారు.

పాదయాత్రను కొనసాగించేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని సైతం అందించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీకి నేను దత్తపుత్రికను అని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. మరి కేసీఆర్‌ బీజేపీకి పెళ్లాం అని అనాలా? నేను నిలదీసినట్లుగా బీజేపీని ఎవరు నిలదీస్తున్నారు? నన్ను నల్లి మాదిరిగా నలిపేస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారు.. తాలిబాన్లు. రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం నడుస్తోంది. కేసీఆర్‌ ఈ తాలిబాన్లకు అధ్యక్షుడు. ఏమి చేసుకుంటారో చేసుకోండి. వైఎస్సార్‌ బిడ్డ దేనికీ భయపడదు.

ఈ బందిపోట్లను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాల్సిన సమయం వచ్చింది’అని షర్మిల వ్యాఖ్యానించారు. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటా. తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం తెచ్చే వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదు’అని ఆమె స్పష్టం చేశారు. అంతకుముందు లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. ఇటీవలి రాజకీయ పరిణామాలు, టీఆర్‌ఎస్‌ వ్యవహారశైలి, పోలీసు నిర్బంధాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపులు, పాదయాత్ర కొనసాగింపుపై విస్తృతంగా చర్చించారు.  

మరిన్ని వార్తలు