కేసీఆర్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: షర్మిల 

10 Dec, 2022 00:53 IST|Sakshi
ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న వైఎస్‌ షర్మిల 

పాదయాత్రను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం 

అక్కడే ఆమె ఆమరణ నిరాహారదీక్ష..అరెస్టు చేసిన పోలీసులు  

కవాడిగూడ/హైదరాబాద్‌: ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వైఎస్‌ఆర్‌టీపీ చేపట్టిన మహాప్రస్థానం పాదయాత్రను అడ్డుకుని సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ వరంగల్‌ పోలీసులు నిరాకరించడం వెనక కేసీఆర్‌ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.

పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ షర్మిల శుక్రవారం హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.అక్కడే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌టీపీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో షర్మిలను, పార్టీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు శాంతియుతంగా 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని, వ్యక్తిగతంలో తాను ఎక్కడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని, ఎవరినీ కించపర్చలేదని అన్నారు. పోలీసులను కేసీఆర్‌ జీతగాళ్లుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన షర్మిలను పోలీసులు లోటస్‌పాండ్‌కు తరలించారు.  

షర్మిల కన్నీటిపర్యంతం: రోడ్డుపై దీక్ష చేస్తున్న షర్మిలని సోలీసులు బలవంతంగా దీక్ష ప్రాంగణం మీదకు తీసుకువచ్చారు. ఈ చర్యతో షర్మిలకు, పార్టీ నేతలకు గాయాలయ్యాయి. పోలీసుల వైఖరితో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా ప్రాపర్టీలో నేను ఏం చేసుకుంటే ఏంటి’అని ప్రశ్నించారు. మా వాళ్లందరినీ విడుదల చేసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను’అని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు