‘వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ’

25 Oct, 2021 09:08 IST|Sakshi

బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పొత్తులుండవ్‌ 

వైఎస్‌ షర్మిల స్పష్టీకరణ 

సాక్షి,మహేశ్వరం( హైదరాబాద్‌): బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. బీజేపీతో వైఎస్సార్టీపీ పొత్తు ఉంటుందని టీఆర్‌ఎస్‌ అనడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

షర్మి ల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని నాగారం, కొత్త తండా చౌరస్తా, డబిల్‌గూడ చౌరస్తా, మన్సాన్‌పల్లి చౌరస్తా, మన్సాన్‌పల్లి, కేసీ తండా చౌరస్తా మీదుగా సాగింది. ఈ సందర్భంగా మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కేసులకు భయపడి ఢిల్లీలో నరేంద్ర మోదీ, అమిత్‌షాల వద్దకు వెళ్లి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కేసీఆర్‌ అవినీతి చిట్టా ఉన్నా.. తమకు భవిష్యత్తులో అవసరమొస్తారనే ఉద్దేశంతో ఏమీ అనడం లేదన్నారు. కేసీఆర్‌ ఫాం హౌస్‌లకు సాగునీరు అందించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించారని ఆరోపించారు.

రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క నిత్యం ఏదో ఒకచోట నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని నిరూపిస్తే, తాను పాదయాత్ర నిలిపివేసి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. దివంగత నేత వైఎస్సార్‌ పాలనలో సువర్ణ పాలన కొనసాగిందని, వైఎస్సార్టీపీకి ఆవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.  

పాదయాత్రలో భాగంగా రైతులు, వృద్ధులు, మహిళలు, యువకులు, కూలీలతో షర్మిల ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. భారీయెత్తున ప్రజలు హాజరైన సభలో వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధులు కొండా రాఘవారెడ్డి, ఏపూరి సోమన్న, పిట్ట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పాదయాత్రలో ఉన్న షర్మిలను ఆదివారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్‌ విజయమ్మ వేర్వేరుగా కలుసుకుని మాట్లాడారు.

చదవండి: పొమ్మనలేక పొగపెట్టారు: ఈటల

మరిన్ని వార్తలు