సర్కారు ఉన్నట్టా.. చచ్చినట్టా!: షర్మిల

22 Jul, 2022 01:58 IST|Sakshi
జమున కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తున్న షర్మిల 

ధర్మపురి/మంచిర్యాల: భారీవర్షాలతో సర్వం పోగొట్టుకున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇంతవరకు సాయం అందించలేదని, అసలు సర్కారు ఉన్నట్టా.. చచ్చినట్టా అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. వరదబాధితుల పరామర్శ యాత్రలో భాగంగా గురు వారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఇందిరమ్మకాలనీలో, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ, మంచిర్యాల పట్టణంలోని గణేశ్‌నగర్, పద్మశాలీవాడ, రామ్‌నగర్, ఎన్టీఆర్‌ కాలనీల్లో ఆమె పర్యటించారు.

ఈ సందర్భంగా వర్షాల వల్ల నష్టపోయిన బాధితులు షర్మిల ముందు తమ గోడు వెళ్ల్లబోసుకున్నారు. సర్కార్‌ నుంచి పైసాకూడా అందలేదని కన్నీటిపర్యంతమయ్యారు. బాధితుల గోస చూసి షర్మిల చలించి పోయారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వరదలను ముందస్తుగా అంచనా వేయకపోవడంతోనే భారీ నష్టం జరిగిందని, ఇది సీఎం కేసీఆర్‌ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు రాజన్నబిడ్డగా ప్రజల ముందుకొచ్చానని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని కోరారు. 

వరద బాధితులకు 25 వేల చొప్పున ఇవ్వాలి
వరద బాధితులకు రూ.10 వేలు కాదు, రూ.25 వేల చొప్పున టీఆర్‌ఎస్‌ పార్టీ ఖజానా నుంచే చెల్లించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. ‘టీఆర్‌ఎస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలో రూ.860 కోట్లు ఉన్నాయంటున్నారు, నెలకు రూ.3 కోట్లు వడ్డీ చొప్పున రూ.25 కోట్లు వస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి కాకుండా ఆ పార్టీ ఖజానా నుంచే చెల్లించాలి’అని అన్నారు.

సీఎం వెళ్లిన ప్రాంతాల్లోనే రూ.పది వేలు సాయం చేస్తారా? ఇక్కడి వాళ్లకు ఇవ్వరా.. వీరు మనుషులు కాదా? అని ప్రశ్నించారు. కడెం, ఎల్లంపల్లి వరద నష్టంపై ముందే అంచనా వేసి ఉంటే ఇంత నష్టం జరిగేదికాదన్నారు. పే స్కేల్‌ అమలు చేయాలని నిరసన చేపట్టిన వీఆర్‌ఏలకు షర్మిల మద్దతు తెలిపారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను కూడా నిర్దాక్షిణ్యంగా విధుల్లోంచి తొలగించారని ధ్వజమెత్తారు. 

మరిన్ని వార్తలు