నాకు ప్రాణహాని ఉంది

5 Dec, 2022 01:17 IST|Sakshi

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

కేసీఆర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘నాకు ప్రాణహాని ఉంది.. అది కేసీఆర్‌.. ఆయన గూండాలతోనే ముప్పు పొంచి ఉంది. కేసీఆర్‌కి నా భయం పట్టుకుంది. అందుకే పాదయాత్రను సాగనివ్వడం లేదు. ఆడవారు లిక్కర్‌ స్కాంలో ఉండొచ్చు.. కానీ రాజకీయాలు చేయకూడదా. షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వాల్సింది నాకు కాదు.. కేసీఆర్‌కు ఇవ్వాలి’వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒక మహిళ పాదయాత్ర చేసి లోపాలు ఎత్తి చూపుతుంటే మింగుడు పడటం లేదని చెప్పారు. ఆదివారంలో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ పార్టీని ఎదగనీయకుండా చేస్తున్నారని, అందుకే పాదయాత్ర చేయనీయకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. తాను పాదయాత్రలో ఉండగానే ముగ్గురు ఏసీపీలు తమ వద్దకు వచ్చి పాదయాత్రను ఆపాలని చెప్పారన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రిమాండ్‌ కోరారని చెప్పారు. మూడోసారి కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా పాదయాత్రను అనుమతించడం లేదన్నారు.  

మమ్మల్ని కొట్టి మేమే తప్పు చేశామంటే.. 
తమని కొట్టి తామే తప్పు చేశామంటున్నారని షర్మిల మండిపడ్డారు. పాదయాత్ర ఆపడానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నామంటున్నారని వాపోయారు. ‘నా బస్సును నేను తగల బెట్టుకున్నానా? మా వాళ్లను కొట్టడంతోపాటు కార్లను పగలగొట్టింది ఎవరు? ఇవన్నీ టీఆర్‌ఎస్‌ చేస్తోంది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు మా బస్సులను తగలబెట్టడమే కాకుండా మా కార్యకర్తలను కొట్టారు. 

అయినా మేము శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు’అని షర్మిల చెప్పారు. షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వాల్సింది తనకు కాదని, ఎంతమంది బిడ్డలు చనిపోయినా విలువ ఇవ్వని కేసీఆర్‌కు నోటీస్‌ ఇవ్వాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర సాగుతోందని, మరి తన పాదయాత్రను ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు.  

షోకాజ్‌కు బదులు చెబుతాం 
వైఎస్సార్‌టీపీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌     
షర్మిల చేపట్టిన పాదయాత్రపై పోలీసులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు బదులు చెబుతామని ఆ పార్టీ లీగల్‌ సెల్‌ చైర్మన్, న్యాయవాది వరప్రసాద్‌ తెలిపారు. పాదయాత్రపై కోర్టు ఇచ్చిన అనుమతి రద్దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర చేస్తున్నామని ముందుగా పోలీసులకు చెప్పామని, ఇప్పటికే డీజీపీకి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. ఈ నెల 3న పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను వివరిస్తే.. ఒక రోజు సమయం కావాలని పోలీసులు అడిగారన్నారు.   

మరిన్ని వార్తలు