పేదల సంక్షేమమే లక్ష్యం 

31 Oct, 2021 01:22 IST|Sakshi
దాద్‌పల్లిలో గిరిజన వేషధారణలో షర్మిల  

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల 

రంగారెడ్డి జిల్లాలో సాగిన పాదయాత్ర 

మంచాల: పేదల సంక్షేమమే తన లక్ష్యమని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని జాపాల, రంగాపూర్, చీదేడ్, దాద్‌పల్లి గ్రామాల మీదుగా సాగింది. జాపాలలో మహిళలు ఆమెకు తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల కుండలు తయారు చేస్తున్న కుమ్మరులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రంగాపూర్‌లో పొలం వద్ద రైతులతో ముచ్చటించారు. దాద్‌పల్లిలో గిరిజన మహిళలు బహూకరించిన లంబాడీ దుస్తులు ధరించి వారితో కలసి ఆడిపాడారు. చీదేడ్‌లో మాటాముచ్చట కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఆయా వర్గాలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌ నియంత పాలన పోవాలంటే.. రాజన్న రాజ్యం రావాలంటే అంతా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి అండగా ఉండి ఆశీర్వదించాలని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు.

కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. పేదలకు పింఛన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రేషన్‌ కార్డులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. కరోనా సమయంలోనూ సామాన్య, పేద ప్రజలను ఆదుకోలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ, సామాజిక న్యాయం కావాలంటే వైఎస్సార్‌ టీపీ రావాలన్నారు.

సేవ చేసేందుకే మీ ముందుకు వచ్చానని.. అందరి కోసం పోరాడతానని పేర్కొన్నారు. అందరికీ ఉచితంగా విద్య, వైద్యం, ఉపాధి అందే వరకు ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పిట్టా రాంరెడ్డి, ఏçపూరి సోమన్న, వేణుగోపాల్‌రెడ్డి, అమృతసాగర్, మాదగోని జంగయ్య గౌడ్, నేనావత్‌ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు జయరాజ్, భాస్కర్, మహేశ్, నందకుమార్, జంగయ్య గౌడ్, వేణు ప్రసాద్, మహేందర్, శ్రీకాంత్, నగేశ్, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు