పాలమూరు పూర్తి ఎప్పుడో అడిగే దమ్ముందా?

23 Sep, 2022 03:09 IST|Sakshi
వికారాబాద్‌ సభలో మాట్లాడుతున్న షర్మిల 

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు షర్మిల సవాల్‌

వికారాబాద్‌: పాలమూరు ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగే దమ్ము ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలకు ఉందా? అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కనీసం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపే ధైర్యం కూడా లేదన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం వికారాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో పాటు స్థానిక ఎమ్మెల్యే అక్రమాలు, ఆక్రమణలను ఎండగట్టారు. రాష్ట్రంలో నాటి వైఎస్సార్‌ పాలన తీసుకొచ్చేందుకే తమ పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పేదలకు పక్కా ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 లాంటి చరిత్రాత్మక పథకాలతో వైఎస్‌ ప్రజల గుండెల్లో దేవుడయ్యారని తెలిపారు.

ఐదేళ్లలోనే ఇన్ని పనులు చేస్తే ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఇంకెంత చేయాలని ఆమె ప్రశ్నించారు. డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగభృతి, దళితబంధు, గొర్రెల పంపిణీ ఇలా ఏ పథకం చూసినా..నీరుగారి పోయినవేనని విమర్శించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నుంచి వికారాబాద్‌ జిల్లాకు 50 టీఎంసీల నీళ్లు వైఎస్‌ కేటాయిస్తే కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టు డిజైన్‌ మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వం కాదా..? అని ఆమె ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు