బహిరంగ చర్చకు సిద్ధమేనా 

18 Feb, 2023 01:09 IST|Sakshi
ఆటో ప్రయాణికులతో మాట్లాడుతున్న షర్మిల 

మంత్రి ఎర్రబెల్లి, బీఆర్‌ఎస్‌ నాయకులకు షర్మిల సవాల్‌

సాక్షి, మహబూబాబాద్‌: ‘నేను మీపై చేసిన ఆరోపణలను అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా.. మీ నిజాయితీని నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమేనా’? అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు. షర్మిల పాదయాత్ర శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామ శివారునుంచి సాగింది.

ఈ సందర్భంగా నెల్లికుదురు, మడిపెల్లిలో ఆమె మాట్లాడారు. వందల ఎకరాల భూమి ఎలా వచ్చిందని మంత్రిని ప్రశ్నించారు. ఆడదానివి కాబట్టి ఉపేక్షిస్తున్నారని మంత్రి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అవుతాపురంలో వైఎస్‌ విగ్రహం ఏర్పాటుకు సహకరించిన వారిపై మంత్రి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరించినట్లు తన దృష్టికి వచ్చిందని షర్మిల పేర్కొన్నారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ తనయాత్రను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదని, ఆయన తనను అడ్డుకుంటే వైఎస్‌ఆర్‌ అభిమానులు తడాకా చూపిస్తారని అన్నారు. 

మార్చి 5న షర్మిల పాదయాత్ర ముగింపు
సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర మార్చి 5వ తేదీన ముగియనున్నదని ఆ పార్టీ ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్‌ తెలిపారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నిత్యం జనం మధ్యలోనే ఉంటూ అనేక పోరాటాలు చేశారన్నారు.  ఈ నెల 20న డోర్నకల్‌ నియోజకవర్గం మీదుగా షర్మిల పాదయాత్ర పాలేరులో అడుగుపెడుతుందన్నారు. ఆ నియోజకవర్గంలోని కూసుమంచిలో జరిగే సభతో పాదయాత్ర ముగుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు