కేసీఆర్‌ కుటుంబ అవినీతిని ప్రశ్నించినందుకే.. 

2 Dec, 2022 00:57 IST|Sakshi
గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న వైఎస్‌ షర్మిల 

టీఆర్‌ఎస్‌ నేతల దాడిపై గవర్నర్‌ తమిళిసైకి షర్మిల ఫిర్యాదు 

నన్ను అరెస్ట్‌ చేసేందుకు సీఎం ముందే ప్రణాళిక రచించారు 

ప్రగతిభవన్‌లో రూ. లక్షల కోట్ల దోపిడీ సొమ్ము.. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలి 

ఆంధ్రకు చెందిన కేటీఆర్‌ భార్యకు ఇచ్చే గౌరవం నాకెందుకివ్వరు? 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ అవినీతిని, ఎమ్మెల్యేల దోపిడీని ప్రశ్నించినందుకే తనపై దాడి జరిగిందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిల ధ్వజమెత్తారు. 3,500 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఇటీవల తనపై జరిగిన దాడి గురించి షర్మిల గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్‌భవన్‌ వెలుపల మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్‌ పతనం మొదలైంది.. 
తాను సాగిస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకొనేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు కొన్ని రోజులుగా కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఫ్లెక్సీలు తగలబెట్టడం, వాహనాలకు నిప్పంటించడం, ధ్వంసం చేయడం, కార్యకర్తలను కొట్టడం చేశారని షర్మిల ఆరోపించారు. ఈ మొత్తం తీరును గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. కేసీఆర్‌ పతనం మొదలైంది కాబట్టే దాడులు చేస్తున్నారని విమర్శించారు.

తనను అరెస్ట్‌ చేయడానికి కేసీఆర్‌ ముందే ప్రణాళిక రచించారని, అందుకే శాంతిభద్రతల సమస్యను టీఆర్‌ఎస్‌ గూండాలు, పోలీసులే సృష్టించారని షర్మిల దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ గూండాల దాడులను కేసీఆర్‌కు చూపేందుకే ప్రగతి భవన్‌కు పార్టీ నేతలతో కలసి బయలుదేరానని... కేసీఆర్‌ ఇంటికి చేరుకోకముందే పోలీసులు ఓవరాక్షన్‌ చేసి అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. వాహనంలో ఉండగానే ఒక మహిళ అని చూడకుండా క్రేన్‌ సాయంతో తనను తీసుకెళ్లారని, అరెస్ట్‌ చేయడమే కాకుండా తనతోపాటు ఉన్న వారిని కొట్టారని ఆరోపించారు. తమను రిమాండ్‌కు తరలించేందుకు విఫలయత్నం చేశారని పేర్కొన్నారు. 

తాలిబన్ల నాయకుడిగా కేసీఆర్‌.. 
తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యం కాదని దుయ్యబట్టారు. తెలంగాణ అఫ్గానిస్తాన్‌గా మారిందని, కేసీఆర్‌ తాలిబన్ల నాయకుడిగా మారారని    షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కుటుంబం ప్రాజెక్టుల పేరుతో రూ. లక్షల కోట్లు దోచుకుందని, కవిత లిక్కర్‌ స్కాంలో, కేటీఆర్‌ బినామీల పేరుతో రూ. లక్షల కోట్లు సంపాదించారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం, ప్రగతిభవన్‌పై దాడులు చేస్తే రూ. లక్షల కోట్లు బయటపడతాయన్నారు. దాడులు జరిగాక కూడా, టీఆర్‌ఎస్‌ నేతలు వరుస ప్రెస్‌మీట్లు పెట్టి తనను బెదిరిస్తున్నారని, బయట అడుగుపెట్టనీయబోమని, దాడులు జరిగితే వారికి సంబంధం లేదని హెచ్చరిస్తున్నారన్నారు.  

కేటీఆర్‌ భార్య ఆంధ్ర నుంచేగా.. 
‘నన్ను ఆంధ్రా పెత్తనం ఏమిటని అంటున్నారు. మరి మంత్రి కేటీఆర్‌ భార్య ఆంధ్రా నుంచి రాలేదా? ఇక్కడ బతకడం లేదా? కేటీఆర్‌ భార్యను మీరు గౌరవించుకున్నప్పుడు, నన్ను ఎందుకు గౌరవించరు? నేను ఇక్కడ (తెలంగాణలో) పెరిగిన దాన్ని. ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకున్నా. ఇక్కడే పెరిగా. అబిడ్స్‌లో స్కూలు, మెహిదీపట్నంలో కాలేజీకి వెళ్లి చదువుకున్నా. ఇక్కడే పెళ్లి చేసుకొని పిల్లలను కన్నా. ఇక్కడి ప్రజలకు సేవ చేయడం నా హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా’అని షర్మిల అన్నారు. ముమ్మాటికీ తాను తెలంగాణ బిడ్డనేనని, పునరుద్ఘాటించారు. 

మరిన్ని వార్తలు