ప్రాజెక్ట్‌ డిజైన్‌ మార్చి నియోజకవర్గానికి అన్యాయం చేశారు

9 Nov, 2022 01:59 IST|Sakshi
పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్న షర్మిల   

వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దివంగత సీఎం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌ నిర్మిస్తే చెన్నూర్‌ నియోజకవర్గానికి లక్ష ఎకరాలలో సాగునీరు అందించాలని అనుకున్నారని, తుమ్మిడిహెట్టి నుంచి సాగు నీరందేదని అయితే సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్ట్‌ డిజైన్‌ మార్చి చెన్నూర్‌ నియోజకవర్గానికి అన్యాయం చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కాదని..బానిస సుమన్‌ అని దొర పక్కన కూర్చునేసరికి దొరపోకడలు పోతున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు రౌడీ సుమన్‌ అయ్యారని ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల, భీమారం మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా చెన్నూర్‌ నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు.

రూ.100 కూడా లేవని చెప్పిన బాల్క సుమన్‌ రూ.100 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కేసీఆర్‌ జన్మలో ఒక్క మాట నిలబెట్టుకోలేదని, మోసం చేసి 420 అయ్యారని విమర్శించారు. గొల్లవాగు ప్రాజెక్ట్‌ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరందించాలని ప్రాజెక్ట్‌ కడితే వైఎస్‌కు పేరొస్తుందని నేటికీ కాలువలు పూర్తి చేయలేని దుస్థితి తెలంగాణ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కోఆర్డినేటర్‌ బెజ్జంకి అనిల్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దుర్గం నగేశ్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు