‘2023 తెలంగాణ.. కేసీఆర్‌ ఫ్రీ’ 

2 Jan, 2023 01:00 IST|Sakshi

ట్విట్టర్‌లో కొత్త హ్యాష్‌ట్యాగ్‌ మొదలెట్టిన వైఎస్సార్‌టీపీ

ఈ ఏడాదే కేసీఆర్‌ చెత్తపాలనకు ఆఖరి సంవత్సరం: షర్మిల జోస్యం  

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ ‘వైఫల్యాల, మోసాల’పాలనను ట్విట్టర్‌ హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా ‘2023 తెలంగాణ కేసీఆర్‌ ఫ్రీ’ద్వారా ప్రపంచమంతా గమనించేలా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఎండగట్టింది. గత ఎనిమిదేండ్ల పాలనలో, ప్రస్తుత బీఆరెస్‌ సర్కారు వల్ల తెలంగాణ ఎన్ని విధాలా దెబ్బతిందో, జాతీ య స్థాయిలో ఎన్ని రంగాల్లో, ఎన్ని సూచీల్లో అట్టడుగు స్థానానికి పడిపోయిందో, వీటన్నిటినీ నెటిజన్ల ముందుంచి కేసీఆర్‌కు తేరుకోలేని షాకిచ్చింది.

దేశంలోనే టాప్‌ ట్రెండింగ్‌లో ఈ కేసీఆర్‌ ఫ్రీ కొనసాగుతోంది. దీనిపై స్పందించిన వైఎస్‌ షర్మిల కొత్త సంవత్సరం మొదటి రోజు కేసీఆర్‌కు తమ పార్టీ షాకిచ్చిందని ట్వీట్‌ చేశారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి రాష్ట్రాన్ని పాలించిన టీఆర్‌ఎస్‌ (ఇప్పటి బీ ఆర్‌ఎస్‌) అవినీ తి, అహంకార, అసమర్థ పాలన వలన విద్య, వైద్య, శాంతిభద్రతలు, పారిశుధ్యం, ఇంకా ఎన్నో రంగాలలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకంటే చివరి స్థానంలో నిలుస్తోందన్నారు.

దుబారా ఖర్చులతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన కేసీఆర్‌ సర్కార్‌ రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పులో ముంచిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హాష్‌టాగ్‌ ద్వారా యువత ఆత్మహత్యలు, అన్న దాత అప్పు లు, కౌలు రైతుల దారుణ స్థితి తదితర అంశాలలో తెలంగాణ పనితీరు, పురోగతి ఎంత చెత్తగా ఉందో ప్రపంచానికి సునిశితంగా వివరించే ప్రయత్నం చేశామన్నారు. తమ పార్టీ పోరాటం బీఆర్‌ఎస్‌ మీద కొనసాగుతుందని పేర్కొంటూ ఈ సంవత్సరం కేసీఆర్‌ చెత్త పాలనకు చివరి సంవత్సరమని వైఎస్‌ షర్మిల జోస్యం చెప్పారు.   

మరిన్ని వార్తలు