మీ ప్రభుత్వం సాధించిందేమిటి? 

6 Nov, 2022 02:22 IST|Sakshi

కేసీఆర్‌ను ప్రశ్నించిన వైఎస్‌. షర్మిల  

రామకృష్ణాపూర్‌(చెన్నూర్‌): బంగారు తెలంగాణ అని చెప్పుకొంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిందేమిటో చెప్పాలని వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్‌ తీసుకొచ్చిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరుమార్చి కాళేశ్వరం చేసిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి అదనంగా ఏమైనా సాగునీరందించారా? అని నిలదీశారు. మహాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా మంచిర్యాల, లక్సెట్టిపేట, హాజీపూర్‌లో ఆమె శనివారం పర్యటించారు.

శనివారం బస చేయనున్న బొక్కలగుట్టకు చేరుకున్న అనంతరం.. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి అంబేడ్కర్‌ సుజల స్రవంతి పేరుతో తీసుకొచ్చిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుతో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు.

గూడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని అప్పట్లో వైఎస్‌ఆర్‌ భావిస్తే దాన్ని సైతం కేసీఆర్‌ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. సింగరేణి కాలరీస్‌లో ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులు ఎట్టిపరిస్థితిల్లో రావని చెప్పిన కేసీఆర్‌... ఇప్పుడు ఓసీలకే ఎర్రతివాచీ పరిచారని వాపోయారు. సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కట్టుకోవడానికి పదిలక్షల వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు.  

మరిన్ని వార్తలు