-

రైతుల సంక్షేమంపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు: వై.ఎస్‌. షర్మిల 

25 Dec, 2022 02:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ పార్టీకి లేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల అన్నారు. రాష్ట్రంలో కల్లాలపైనే రైతుల గుండెలు ఆగిపోతున్నా, పురుగుమందు తాగి నురగలు కక్కి చచ్చిపోతున్నా..పట్టించుకోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దొరకు పంజాబ్, హరియాణా రైతులే కనబడతారని ఎద్దేవా చేశారు.

ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అంటే కాలువలు, చెరువులు,రిజర్వాయర్లు కాదని, కే అంటే ‘కన్నీళ్లు’, సీ అంటే ‘చావులు’, ఆర్‌ అంటే ‘రోదన’లు అని, బీఆర్‌ఎస్‌ అంటే రైతులకు భరోసా ఇవ్వని బందిపోట్ల రాష్ట్ర సమితి అని అభివర్ణించారు. భూస్వాములకు రూ.లక్షలకు లక్షలు రైతుబంధు ఇచ్చి, కౌలు రైతులను కాటికి పంపుతున్న రాక్షస ప్రభుత్వమిదని, బీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు