మేం గెలిస్తే తొలి సంతకం ఉద్యోగాల భర్తీపైనే 

12 Oct, 2022 01:01 IST|Sakshi

నిజాంసాగర్‌ (జుక్కల్‌): వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగాల నియామకంపైనే చేస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె మంగళవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండల కేంద్రంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందన్న సీఎం కేసీఆర్‌ కుటుంబంలో కొడుకు, కూతురు, అల్లునికి మాత్రం రాజకీయ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు చదివిన లక్షలమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని కానీ రాష్ట్ర ప్రభుత్వం 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌ వేయడంతో ఒక్కొక్క పోస్టుకు 900మంది పోటీపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్‌ ఆ మేరకు నోటిఫికేషన్లు ఇచ్చి 3.8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌  చేశారు. కొత్త మండలాలు, జిల్లాల్లో ఉద్యోగా­లు సృష్టించి నిరుద్యోగాన్ని తీర్చాలని కోరారు.

మరిన్ని వార్తలు