ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయి 

17 Oct, 2022 00:56 IST|Sakshi
బోధన్‌లో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ షర్మిల  

బోధన్‌/బోధన్‌టౌన్‌: ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక రావడంతోనే గిరిజనబంధు, మైనారిటీలకు రిజర్వేషన్లు అంటూ కేసీఆర్‌ హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని పెంటాకుర్దు నుంచి బోధన్‌ వరకు సాగింది.

అనంతరం నిర్వహించినసభలో షర్మిల మాట్లాడారు. లిక్కర్‌ స్కాంలో కూతురు అరెస్టు కాకుండా ఉండేందుకు కేసీఆర్‌ ఢిల్లీలో తిప్పలు పడుతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఉన్నా రని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో పాలన స్థంభించిపోయిందని అన్నారు. కేసీఆర్‌ చెప్పే ప్రతి పథకంలోనూ మోసం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అబివృద్ధి చేసినట్లు చూపిస్తే ముక్కు నేలకు రాసి పాదయాత్ర ముగించి ఇంటి వెళ్తానని పేర్కొన్నారు. ప్రజలకు సమస్యలు ఉన్నాయని తాను నిరూపిస్తే కేసీఆర్‌ పదవికి రాజీనామా చేసి దళితనేతను ముఖ్యమంత్రి చేస్తారా అని ఆమె సవాల్‌ విసిరారు. 

మరిన్ని వార్తలు