వైఎస్సార్‌ కృషితోనే పాలమూరుకు పచ్చదనం 

18 Sep, 2022 02:46 IST|Sakshi
గంగాపూర్‌లో మహిళలతో  మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల  

ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల  

జడ్చర్ల: వలసలు, కరువుతో అల్లాడిన పాలమూరు జిల్లా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగానే నేడు పచ్చని పంటలతో కళకళలాడుతోందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె గంగాపూర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు.

వైఎస్‌ హయాంలో ప్రాజెక్టులు నిర్మిస్తే అక్కడక్కడా మిగిలిన పనులను సైతం సీఎం కేసీఆర్‌ పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. అలాగే వైఎస్‌ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. రుణమాఫీ చేయకపోవడంతో పంట రుణాల వడ్డీలకు రైతుబంధు సాయం సరిపోవడం లేదన్నారు. బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెడుతుందని, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిపక్ష పాత్ర పోషించి ఉంటే కేసీఆర్‌ అరాచకాలు సాగేవి కావని, అందుకే తాను పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని చెప్పారు. 

మరిన్ని వార్తలు