జనం లేకే కుట్రకు తెర

25 Aug, 2023 03:36 IST|Sakshi

ప్రజలు ఎక్కువగా రాలేదని  లోకేశ్‌ చిందులు 

యార్లగడ్డ అసమర్థుడంటూ  మండిపాటు 

జనాన్ని పోగు చేసి పరువు కాపాడాలని కొల్లు రవీంద్రకు ఆదేశం 

శాంతి, భద్రతల సమస్యలు  సృష్టించి మైలేజ్‌ పొందే యత్నం 

ప్రభుత్వాన్ని పొగుడుతూ ఫ్లెక్సీ వేశారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి 

 యువగళం టీంను దాడికి ఉసిగొల్పిన లోకేశ్, దేవినేని ఉమా 

ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్‌స్టేషన్‌లోనూ దౌర్జన్యం

సాక్షి ప్రతినిధి, విజయవాడ/హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌/నూజివీడు: యువగళం పాదయాత్ర జనాలు లేక వెలవెలబోయింది. గురువారం మధ్యా­హ్నం తర్వాత జనం బాగా పలుచబడి పోవటంతో ఇటీవల టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుపై లోకేశ్‌ విరుచుకుపడ్డారు. అసమర్థుడు.. జనాలను తేలేకపోయాడని ఇతర నాయకుల ముందే చిందులు తొక్కారు. కొల్లు రవీంద్రను పిలిచి మీరైనా జనాన్ని పోగు చేసి.. జిల్లాలో చివరి రోజు యాత్రలో పరువు పోకుండా కాపాడాలని కోరారు. దీంతో కొల్లు రవీంద్ర గతంలో టీడీపీలో పని చేసిన కొంత మంది నాయకులకు ఫోన్‌ చేసి.. బతిమిలాడి రప్పించారు. కొంత మంది నేతలు కార్యకర్తలను బలవంతంగా అప్పటికప్పుడు తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ నేతలు, కార్యకర్తల తీరు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నాలుగేళ్లుగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైఎస్సార్‌సీపీ నాయకుడు, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ కసుకుర్తి శ్రీనివాసరావు, ఆయన తనయుడు చిన్ను వారి సొంత స్థలంలో బ్యానర్‌ ఏర్పాటు చేశారు. దీనిపై లోకేశ్‌ యువగళం టీం సభ్యులు రౌడీమూకల్లా విరుచుకుపడ్డారు. క్షణాల్లో ఆ బ్యానర్‌ను ధ్వంసం చేసి, అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తలారి ఈశ్వరరావు, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ కసుకుర్తి శ్రీనివాసరావు, ఆయన తనయుడు చిన్ను, పార్టీ నాయకులు తలారి పండు, మెడబలిమి చిరంజీవిలపై విచక్షణారహితంగా దాడి చేశారు.

బ్యానర్‌ను కట్టిన కర్రలతో వైఎ­స్సార్‌సీపీ నాయకులను ఇష్టారాజ్యంగా కొట్టారు. కిందపడేసి కాళ్లతో తొక్కారు. అరుపులు, కేకలతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నారా లోకేశ్, దేవినేని ఉమా కనుసైగతో రెచ్చిపోయి రాక్షసత్వంగా ప్రవర్తించారు. వారి నుంచి కర్రలను లాక్కునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. అనంతరం టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించారు. ఈ దాడిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల­పైనా విరుచుకుపడ్డారు. కొందరి సెల్‌ఫోన్‌లు, కెమెరాలు లాక్కుని డేటాను డిలీట్‌ చేశారు. ఎమ్మె­ల్యే వంశీ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.   

కులం పేరుతో దూషించారు.. 
టీడీపీ నేతలు తమను ఎస్సీ, ఎస్టీ కులం పేరుతో దూషి­ంచారని, దాడి చేసి కొట్టారని వైఎస్సార్‌సీపీ నేతలు వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతలో టీడీపీ నేత దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, ఇతర నేతలు, కార్యకర్తలు వారిని దూషిస్తూ పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చారు. ఆ ముగ్గుర్ని కులంపేరుతో దూషిస్తూ పోలీసుల ఎదుటే వారిపై దాడికి యత్నించారు. పోలీసులు టీడీపీ నేతలను బయటకు పంపారు.

ఈ ఘటనపై దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్రతో కలిపి 22 మంది పోలీస్‌స్టేషన్‌లోనే తమపై దాడికి యత్నించారని, కులం పేరుతో దూషించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అంతకు ముందు వైఎ­స్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి వెల­గపల్లి ప్రదీప్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 

మైలేజ్‌ కోసం దిగజారిన టీడీపీ  
కృష్ణాజిల్లాలో యాత్ర చివరి రోజు జనాలు లేకపోవటంతో ఏదో ఒక రకంగా శాంతిభద్రతల సమస్య సృష్టించి మైలేజ్‌ పొందాలని టీడీపీ నేతలు పన్నా­గం పన్నారు. వైకాపా కార్యకర్తలను, పోలీసులను కవ్వించి ఏదొక విధంగా శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొద్దిసేపు ధర్నా, నిరసన చేపట్టారు.

పోలీసులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంయమనం పాటించి ఎదురు దాడికి దిగకపోవడంతో వారు చేసేదేమీ లేక యాత్రను త్వరగా ముగించుకుని ఏలూరు జిల్లాలోకి వెళ్లిపోయారు. కాగా, యువగళం పాదయాత్రలో లోకేశ్‌ను అడ్డుకున్నారని, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమను పోలీస్‌స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకున్నారని టీడీపీ నేతలు కొంత మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. ఆయా ఘటనల్లో వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా తెలిపారు.

పాదయాత్రలో ఏబీవీ 
ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద టీడీపీ నేత లోకేశ్‌ పాదయాత్ర ఏలూరు జిలా­్లలోకి ప్రవేశించింది. పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు.  సింగన్నగూడెంలో గౌ­డ సామాజిక వర్గీయులతో, మల్లవల్లిలో బీసీ కుల­స్తులతో, కొత్త మల్లవల్లిలో ఆయిల్‌పామ్‌ రైతులతో ఆయన భేటీ అయ్యారు.

ఇదిలా ఉండగా మాజీ ఇంటిలిజెన్స్‌ చీఫ్, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మల్లవల్లిలో లోకేశ్‌ను కలిసి మం­తనాలు సాగించారు. పరోక్షంగా ఏర్పాట్లు సైతం పర్యవేక్షించారు. గురువారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో బస వద్ద ఆయన లోకేశ్‌ను కలిసి చర్చించారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, రావి వెంకటేశ్వరరావుతో కూడా మాట్లాడారు.  టీడీపీ నేతల బ్యానర్లలో  ఆయన ఫొటో ముద్రించడం గమనార్హం.

మరిన్ని వార్తలు