పొగాకు బ్యారన్లు అగ్నికి ఆహుతి

10 Mar, 2023 01:22 IST|Sakshi
మాచవరంలో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

రైతులకు రూ.21 లక్షల ఆస్తి నష్టం

నాగులుప్పలపాడు: క్యూరింగ్‌లో ఉన్న పొగాకు బ్యారన్‌లో మొద్దుగొట్టంపై అల్లిక కర్ర జారిపడటంతో మొత్తం మూడు బ్యారన్లు అగ్నికి ఆహుతైన ఘటన గురువారం ఉదయం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దండా అంజిరెడ్డి, వాకి అంజిరెడ్డి, వాకా శ్రీనివాసరెడ్డి, ఇనగంటి వెంకటేశ్వరరెడ్డికి చెందిన మూడు పొగాకు బ్యారన్లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ మూడింటిలో పొగాకు క్యూరింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఉన్న బ్యారన్‌లో కర్ర జారి మెద్దు గొట్టంపై పడటంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న బ్యారన్లకు వ్యాపించాయి. మంటలను అదుపుచేయడానికి గ్రామస్తులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఒంగోలు నుంచి వచ్చిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేయగా, అప్పటికే పూర్తిగా పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పొన్నలూరు మండలంలో..

పొన్నలూరు: మండలంలోని పెదవెంకన్నపాలెం గ్రామంలో పొన్నగంటి మహేష్‌కి చెందిన పొగాకు బ్యారన్‌ గురువారం ప్రమాదవశాత్తు కాలిపోయింది. క్యూరింగ్‌ జరుగుతున్న సమయంలో పొగాకు అల్లిక కర్రలు జారి మొద్దుగొట్టంపై పడటంతో మంటలు చెలరేగాయి. కందుకూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.6 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత రైతు వాపోయారు.

జగన్‌ వెంటే మేమంతా..

నూర్‌బాషా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రసూల్‌

త్వరలోనే నూర్‌బాషా గర్జన

ఒంగోలు: తమ సామాజిక వర్గమంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని నూర్‌బాషా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఒ.రసూల్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలనేదే సీఎం ఉద్దేశమన్నారు. నూర్‌బాషా గర్జన చేపట్టాలనే ఆలోచనను సీఎం ముందు ఉంచగా ఆయన సూచించిన విషయం పేద ప్రజలపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమను తెలియజేసిందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పర్యటించి నూర్‌బాషాల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారు ఇంకా ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకున్న తర్వాత గర్జన కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. అందులో భాగంగానే తాము రాష్ట్రమంతా పర్యటిస్తున్నామన్నారు. నూర్‌బాషాలకు ఒక ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలనే అంశాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచబోతున్నామన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న సీఎంపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరమన్నారు. టైలర్ల సంఘం ఉపాధ్యక్షులు నాగూర్‌ మాట్లాడుతూ.. 14 ఏళ్లు సీఎం ఉన్న చంద్రబాబు నూర్‌బాషాలకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చంద్రబాబు చూశారని విమర్శించారు. నాయీబ్రాహ్మణులు, దళితులను చులకనగా చూసిన చంద్రబాబుకు మరోసారి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నూర్‌బాషా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనుబాషా, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకేసుల బాదుల్లా, వై.పాలెం అధ్యక్షుడు డాక్టర్‌ మీరావలి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు