పవిత్ర మాసం రంజాన్‌

24 Mar, 2023 05:46 IST|Sakshi
ఈద్గా వద్ద ప్రార్థనల్లో ముస్లింలు (ఫైల్‌)

కనిగిరి రూరల్‌:

ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మాసం రంజాన్‌. ఈ నెలలో ముస్లింలు ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులలో భక్తిభావం ఉప్పొంగుతుంది. ధార్మిక చింతన, ప్రేమ, సౌభ్రాతృత్వం, దానగుణం, క్రమశిక్షణ, పరోపకారం తదితర నియమాలను ముస్లింలు పాటిస్తారు. రంజాన్‌ నెలలో అత్యంత నిష్టగా జరుపుకునే రోజు షబ్‌–ఏ–ఖదర్‌. దీని తర్వాత మూడు రోజులకు రంజాన్‌ పండుగను చేస్తారు. శుక్రవారం నుంచి రంజాన్‌(నెల) మాసం ప్రారంభం కానుంది. ఉమ్మడి ప్రకాశంలో అత్యధికంగా ముస్లిం జనాభా ఒంగోలు, కనిగిరి, కందుకూరు, పొదిలి, మార్కాపురం, కంభం, గిద్దలూరు, పర్చూరు తదితర ప్రాంతాల్లో ఉన్నారు. ప్రస్తుత జిల్లాలోని మున్సిపాలిటీల్లో అత్యధికంగా కనిగిరిలో ముస్లింలు ఎక్కువ ఉన్నట్లు నివేదికలున్నాయి. జిల్లాలో సుమారు 230 వరకు మసీదులున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాలోని మసీదులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలుచోట్ల రంజాన్‌మాస ప్రారంభ సూచికంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ముస్లింలు అధికంగా ఉండే ఏరియాల్లో తోరణాలు.. ఫెక్సీలతో కళకళలాడుతున్నాయి.

రోజా(ఉపవాస దీక్షలు)

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహార పానీయలు ముట్టకుండా (కఠోర దీక్ష) ఉపవాసాన్ని పాటిస్తారు. లాలాజలం కూడా మింగరు. అత్యంత నిష్టతో ఉపవాసాన్ని (రోజాను) ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు సహార్‌ అని, సూర్యస్తమయం తర్వత ఇఫ్తార్‌ అని పిలుస్తారు. రోజా ఉండేవారు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఏదైనా ఫలాహారాలు తీసుకుంటారు. రోజుకు కనీసం 13 గంటలు ఉమ్మికూడా మింగకుండా కఠోర దీక్షలను ఆచరిస్తారు. రోజా పాటించే వారు మనసును భగవంతుని పై లగ్నం చేసి చెడు ఆలోచనలకు దూరంగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని మసీదుల్లో, దైవ ధ్యానంలో గడుపుతారు. ఈ దీక్షల వల్ల మానవునిలో భగవంతుని పట్ల భక్తి, నమ్మకం, విశ్వాసం, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అన్న భావం పెంపొందుతుంది.

ఏహ్‌ తే కాఫ్‌: ఈ మాసంలో 21వ రోజు నుంచి నెల చివరి వరకు (తపోనిష్టతో) ఏహ్‌తేకాఫ్‌ కూర్చుంటారు. ఈ ఏహ్‌తేకాఫ్‌ పాటించే వారు మసీదులోనే పూర్తి సమయాన్ని గడపుతూ.. ప్రార్థనల్లో దివ్య ఖురాన్‌ (దైవ గ్రంథాలు) చదువుతూ ఉపవాస దీక్షలో నిమగ్నమవుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మసీదు నుంచి బయటకు అడుగుపెడతారు.

జకాత్‌: ముస్లింలలో మరీ ముఖ్యమైన సాంప్రదాయం జకాత్‌. ప్రతి వ్యక్తి తన లాభార్జనలో కొంత మేర నిరుపేదలకు దాన, ధర్మాలు చేయడాన్ని జకాత్‌గా పిలుస్తారు. ప్రతి మనిషి తనలాగే ఉన్నతుడు కావాలని కోరుకోవడం ఈ జకాత్‌ యొక్క ప్రధానుద్దేశం. జకాత్‌ నిధితో నిరుపేదలకు వస్తువుల రూపంలో గాని, నగదు రూపంలో గాని దానం చేస్తారు. అయితే దానస్వీకర్తల పేర్లను గోప్యంగా ఉంచడమే దీని ప్రధాన నియమం. రంజాన్‌ నెలలోనే జకాత్‌ను ఇస్తారు.

ఫిత్రా: రంజాన్‌మాసం చివరిరోజున జరుపుకునే పర్వదినం రంజాన్‌ (ఈద్‌–ఉల్‌–ఫితర్‌). దేవుని అనుగ్రహం కోసం, కృతజ్ఞతగా నిరుపేదలకు ఫిత్రాను (దానం) ఇస్తారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు కిలోల గోధుమలు లేదా, దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యలు లేదా నగదు దానం చేస్తారు. రంజాన్‌ను ప్రతి ముస్లిం లోటులేకుండా సంతోషంగా జరుపుకునేందుకు చేయాల్సిన దాన, ధర్మాలను ఇస్లాం మతం బోధిస్తుంది.

ఇఫ్తార్‌ ప్రత్యేకత

రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాసదీక్షను విరమింప చేసే కార్యక్రమాన్నే ఇఫ్తార్‌ అంటారు. ఈ ఇఫ్తార్‌ సమయంలో తీసుకునే ఆహారాన్ని దీక్ష వాసులకు అందించడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇఫ్తార్‌ విందులను ముస్లింలే కాకుండా ఇతరులు కూడా రోజా ఆచరించిన వారికి ఇస్తారు.

తరావీహ్‌ నమాజ్‌

ముస్లింలు ప్రతిరోజు 5 సార్లు నమాజును (ఉదయం ఫజర్‌, మద్యాహ్నం జోహర్‌, సాయంత్రం 5 గంటలకు అసర్‌, రాత్రి 6.30 గంటలకు మగ్‌రీబ్‌, రాత్రి 8 గంటలకు ఇషా నమాజ్‌) చేస్తారు. అయితే రంజాన్‌ నెలలో ఇషా నమాజ్‌ తర్వాత, ప్రత్యేకంగా ఎంతో నిష్టతో మరో 20 రకాత్‌లు ‘తరావీహ్‌’ నమాజ్‌ చేస్తారు. రంజాన్‌ మాసంలో తరావీహ్‌ నమాజ్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది.

రేపటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం జిల్లాలో ముస్తాబవుతున్న మసీదులు

రోజెకి నియ్యత్‌:

అల్లాహుమ్మా అసూముగదన్‌ లక ఫగ్‌ ఫిర్లీ మాఖద్దమ్‌తు వమా అఖ్ఖర్తు..

(ఉదయం ‘సహార్‌’ (ఉపవాసం ప్రారంభించేటప్పుడు) చేసే సమయంలో చేసే దువా)

ఇఫ్తార్‌కి దువా:

అల్లాహుమ్మ లక సుమ్తు వఫిక ఆమన్‌తు వఅలైక తవక్కల్తు అలారిజ్‌ ఖిక అఫ్తర్తు ఫత ఖిబ్బల్‌ మిన్నీ..

(సాయంత్రం ‘ఇఫ్తార్‌’(ఉపవాస దీక్ష విరమించే)సమయంలో చేసే దువా..

(రంజాన్‌ అనేది ఒక మాసం(నెల) పేరు. ఉర్దూలో రంజ్‌ అనగా దహించేదని, ఆన్‌ అంటే నెల అని అర్థం. మనషుల పాపాలన్ని ఉపవాసాలతో, దానాల్లో దహిస్తాయి. కనుక రంజాన్‌ అనే పేరు వచ్చింది. ఈ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఆవిర్భవించింది. రంజాన్‌ నెలలో ఖురాన్‌ చదివితే మరింత పుణ్యం లభిస్తుందని మత పెద్దలు చెబుతారు.)

మరిన్ని వార్తలు