భార్యతో విభేదాలు.. ఆస్ట్రేలియాకు భర్త జంప్‌!

19 Jun, 2023 12:11 IST|Sakshi

ఒంగోలు టౌన్‌: అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తనకు తెలియకుండా తన భర్త ఆస్ట్రేలియా వెళ్లిపోయాడని ఓ వివాహిత ఆదివారం ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన తుమాటి మనీషాకు నెల్లూరు జిల్లా కావలికి చెందిన నాతాని వెంకటేశ్‌తో గత ఏడాది ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో వివాహమైంది. వివాహ సమయంలో రూ.1.30 కోట్ల విలువ చేసే పొలంతో పాటుగా ఆడపడచు కట్నం, పెళ్లి ఖర్చులు, బంగారం నగలు కలిపి రూ.15 లక్షలు ముట్టచెప్పారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడని పెళ్లి కుమారుడికి అడిగినంత ఇచ్చి పెళ్లి చేశారు.

కావలిలో కాపురం పెట్టిన తరువాత అత్తామామలు నాతాని యానాది నాయుడు, అరుణలతో పాటుగా ఆడపడచు కంఠమణి వెంకట శేషమ్మ అలియాస్‌ శైలజలు సూటిపోటి మాటలతో వేధించడం మొదలు పెట్టారు. భోజనం కూడా పెట్టకుండా కొట్టేవారు. దీంతో మద్దిరాలపాడు గ్రామంలో కాపురం పెట్టారు. సజావుగా కాపురం కొనసాగుతున్న సమయంలో అత్తామామలు, ఆడపడచులు వచ్చి భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించారు. రూ.20 లక్షలు అదనపు కట్నం తెస్తేనే కావలికి కాపురానికి తీసుకొని వెళతామని చెప్పి వెంకటేశ్‌ను వెంట తీసుకెళ్లారు.

వీరితో పాటుగా భర్త బంధువులైన మద్దినేని శ్రీహరి, శ్యామలా దేవిలు పదే పదే మనీషా ఇంటికి వచ్చి వెంకటేశ్‌కు విడాకులు ఇస్తే రూ.30 లక్షలకు సెటిల్‌ చేస్తామని నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. వెంకటేశ్‌కు భార్య ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయడం లేదు. గత సంవత్సరం ఆగస్టులోనే వెంకటేశ్‌ తనకు చెప్పాకుండా ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్లు తెలిసిందని భార్య మనీషా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు