రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌ మృతి

18 Sep, 2023 17:28 IST|Sakshi
కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో భార్య, కుమార్తెతో మర్రిబోయిన గోపి

ప్రకాశం: వినాయక చవితి పర్వదినాన గ్రామంలో పెట్టే వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌ ఇచ్చి బైక్‌పై తిరిగి వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మద్దిరాలపాడు సమీపంలోని 216 జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మర్రిబోయిన గోపి (27) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అమ్మవారి కొలుపులు, వినాయక చవితి పండుగ నేపథ్యంలో గ్రామానికి వచ్చాడు.

అదే గ్రామానికి చెందిన ఒకే సామాజికవర్గానికి చెందిన బత్తిన అరవింద్‌ (19), మర్రిబోయిన మణికంఠ (21) లతో కలిసి శనివారం రాత్రంతా గ్రామంలో జరిగిన అమ్మవారి కొలుపుల్లో సంతోషంగా గడిపారు. ఆదివారం వేకువ జామున 4 గంటల సమయంలో ఒంగోలు వెళ్లి వినాయక విగ్రహానికి అడ్వాన్సు ఇచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మద్దిరాలపాడు గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై పంక్చరు పడిన లారీ ఆగి ఉంది. దీనిని గమనించని యువకులు తమ మోటారు సైకిల్‌తో వెళ్లి బలంగా ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ భక్తవత్సల రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.

పమిడిపాడులో విషాదఛాయలు:
మృతులు ముగ్గురూ కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన వారు...అదీ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుల్లో మర్రిబోయిన గోపి (30) ఐదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప ఉంది. మూడు రోజుల క్రితమే పాపకు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే కొలుపులకు అని వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకి కవల సోదరుడు ఉన్నాడు.

మర్రిబోయిన మణికంఠ (22) తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. తండ్రి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డిగ్రీ డిస్‌కంట్యూ చేసి ఖాళీగా ఉన్నాడు. వివాహం కాలేదు. బత్తిన అరవింద్‌ (21) తల్లిదండ్రులకు రెండో సంతానం. ఇతనికీ వివాహం కాలేదు. తండ్రి గొర్రెల కాపరి. చేతికి అందివచ్చిన బిడ్డలను మృత్యువు కబళించడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.

మరిన్ని వార్తలు