భర్తతో కలిసి థాయ్‌లాండ్‌ టూర్‌కు వెళ్లాల్సి ఉండగా.. భార్య ఆత్మహత్య

30 Sep, 2023 12:43 IST|Sakshi

ప్రకాశం: ఉరి వేసుకుని అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మంగపాటివారిపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొప్పోలు కళ్యాణి (38) వెల్లటూరు పంచాయతీలో అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త సురేష్‌ వ్యవసాయం చేస్తూనే ఓ ప్రైవేట్‌ మార్కెట్‌ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

మార్కెట్‌ కంపెనీలో సురేష్‌ బాగా పనిచేయడంతో ఆ కంపెనీ వారు సురేష్‌ కుటుంబానికి అక్టోబర్‌ 1వ తేదీ థాయ్‌లాండ్‌ టూర్‌ ఏర్పాటు చేశారు. దీంతో సురేష్‌, కళ్యాణి థాయ్‌లాండ్‌ వెళ్లడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమోగానీ గురువారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఉదయం నిద్రలేచిన భర్త సురేష్‌ గమనించి చుట్టుపక్కల వారి సాయంతో కిందికి దించి చూడగా అప్పటికే కళ్యాణి మృతి చెందింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై దాసరి రాజారావు సంఘటన స్థలానికి చేరుకుని కళ్యాణి మృతదేహాన్ని పరిశీలించారు. ఆపై మృతిపై అనుమానాలున్నాయని, ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు