లాభాల పరిమళం..!

6 Nov, 2023 00:28 IST|Sakshi
పోరుమామిళ్లపల్లిలో సాగవుతున్న బంతి పూలు

మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా పూల సాగు రైతులకు లాభాలు కురిపిస్తోంది. ఇప్పటికే దసరా సీజన్‌ లాభాలు తెచ్చిపెట్టగా, ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌తో పాటు రాబోయే కార్తీకమాసం, అయ్యప్పస్వామి, తదితర మాలధారణలు, దీపావళి, జనవరి 1, సంక్రాంతి పండుగల నేపథ్యంలో పూల సాగు రైతులు మరింతగా లాభాల బాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 108.44 ఎకరాల్లో పూలసాగు జరుగుతోంది. అందులో పశ్చిమ ప్రకాశంలోని కొమరోలులో 5 ఎకరాలు, గిద్దలూరులో 5, త్రిపురాంతకంలో 5, పెద్దారవీడులో 1.17 ఎకరాలు, బేస్తవారిపేటలో 11.69, మార్కాపురంలో 1.50, పొదిలిలో 1.30, పుల్లలచెరువులో 2, చీమకుర్తిలో 3.38, సీఎస్‌ పురంలో 7.29, కనిగిరిలో 7.45, కంభంలో ఒక ఎకరాలో, టంగుటూరు, దర్శి, నాగులుప్పలపాడు తదితర ప్రాంతాల్లో కూడా పూల సాగు చేపట్టారు. ఇందులో ప్రధానంగా మేరీ గోల్డ్‌, మల్లె, లిల్లీ, గులాబీల సాగు ఎక్కువగా ఉంది. ఈ రైతులంతా కూడా ఈ క్రాప్‌లో నమోదు కావడం విశేషం.

రకరకాల పూల సాగు...

జిల్లాలో మేరీ గోల్డ్‌ 58.83 ఎకరాల్లో, మల్లె 25.96 ఎకరాలు, లిల్లీ పూలు 23.65 ఎకరాలతో పాటు బంతి, చామంతి, గులాబీ పూలు సాగుచేస్తున్నారు. జిల్లాకు అవసరమైన మేర పూలు లేకపోవడంతో బెంగళూరు నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో పూసే పూలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఇటీవల దసరా సీజన్‌లో బుట్ట బంతి పూలను రూ.250 నుంచి రూ.300కు విక్రయించారు. పావు కిలో చామంతి పూలను రూ.100 చొప్పున విక్రయించారు. ఇదే పరిస్థితి గులాబీ, లిల్లీ పూలకు కూడా ఏర్పడింది. ఇక, రాబోయే కార్తీకమాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశితో పాటు అయ్యప్పస్వామి భక్తులు కూడా ప్రతిరోజూ ఆలయాలకు పూలమాలలు తీసుకెళ్తారు. దీంతో పాటు పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో కళ్యాణ మండపాల డెకరేషన్లకు ఎక్కువగా పూలు వాడుతుంటారు. ఇళ్లల్లో జరిగే పూజా కార్యక్రమాలకు కూడా పూలను ఎక్కువగానే వాడుతున్నారు. దీంతో పూలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. కంభం మండలం పోరుమామిళ్లపల్లి, దొనకొండ ప్రాంతాల్లో పూల సాగు రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు.

జిల్లాలో రైతులకు లాభాలు కురిపిస్తున్న పూల సాగు గులాబీలు, బంతిపూలు, చామంతులకు పెరిగిన డిమాండ్‌ సీజన్‌ కావడంతో రైతులకు పెరిగిన ఆదాయం

ఈ క్రాప్‌ నమోదు పూర్తి

జిల్లాలో పూలసాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. 108.44 ఎకరాల్లో పూలు సాగుచేసిన రైతుల వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేశాం. పూల దిగుబడి ఎకరాకి 4 నుంచి 6 టన్నుల వరకూ వస్తోంది. కోసిన పూలను తడి గోనె సంచుల్లో, వెదురుబుట్టల్లో నింపి పైన తడిబట్ట లేదా పాలిథిన్‌ షీట్‌ కప్పి రవాణా చేయాలి. బంతి పూలు బాగా విచ్చుకున్న తర్వాతే కోయాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పూలు కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇస్తే కోత తర్వాత పూలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. బంతి తోటల్లో కలుపు రాకుండా చూసుకోవాలి.

– గోపీనాఽథ్‌, జిల్లా హార్టీకల్చర్‌ ఆఫీసర్‌, ఒంగోలు

ఎకరా బంతి, ఎకరా రోజా పూలు సాగు చేశా

ఈ ఏడాది నేను ఎకరా పొలంలో రోజా పూలు, మరో ఎకరాలో బంతి, చామంతి పూలు సాగుచేశా. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. పండుగ సీజన్లు కావడంతో మార్కెట్‌లో ధర కూడా బాగానే ఉంది.

– వెంకట రమణమ్మ, పోరుమామిళ్లపల్లి, కంభం మండలం

మరిన్ని వార్తలు