దశ తిరిగే

2 Dec, 2023 01:24 IST|Sakshi
యర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన పెట్రోలు బంకు
సహకారం..

సహకార రంగాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక ఈ రంగం దశ తిరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకార రంగాన్ని బలోపేతం చేసి వాటి తలరాతను మార్చేశారు. సహకార పరపతి కేంద్రాల ద్వారా పలు రకాల సేవలు రైతులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలో జనరిక్‌ మందుల షాపులు, పెట్రోల్‌ బంకుల ఏర్పాటు, ఆధార్‌లో మార్పులు, చేర్పులు పాన్‌కార్డు, అలాగే 1బీ, అడంగల్‌ సర్టిఫికెట్లు ఇలా వివిధ రకాల సేవలు అందిస్తూ సేవలను విస్తృతం చేశారు.

ఒంగోలు సిటీ: ఒకప్పుడు పరిమిత సేవలందించే సహకార సంఘాలు నేడు రైతుల అవసరాలు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాణిజ్య సరళిలో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేస్తున్నాయి. బహుళ సేవలను సహకార పరపతి కేంద్రాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాయి. అందులో భాగంగా జిల్లాలో 12 జనరిక్‌ ఔషధ కేంద్రాలు, ఏడు పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేయగా, మరో ఐదు బంకులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

జనరిక్‌ ఔషధ కేంద్రాలు..

ప్రధానమంత్రి జనరిక్‌ ఔషధ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలివిడతగా జిల్లాలో 12 సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)ను ఎంపిక చేసింది. త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది.

అందుబాటులోకి 250 రకాల సేవలు..

సహకార పరపతి సంఘాల్లో కామన్‌ సర్వీస్‌ సెంటర్ల (సీఎస్‌సీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గతంలో రైతులు, ప్రజలకు ఏదైనా సర్టిఫికెట్‌ 1బీ, అడంగల్‌, ఆధార్‌లో మార్పులు, చేర్పులు పాన్‌కార్డు వంటి తదితర సేవలు కావాలంటే మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో మీ సేవ నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేసి దోపిడీకి పాల్పడేవారు. వీటికి చెక్‌పెట్టేలా ప్రతి సహకార పరపతి సంఘంలో కామన్‌సర్వీస్‌ సెంటర్లు ఏర్పాటు చేసి 250 రకాల సేవలను అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 172 సహకార పరపతి సంఘాలు ఉండగా, ఇప్పటికే 168 కేంద్రాల్లో కామన్‌ సర్వీస్‌ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సూపర్‌బజార్లు, టెంట్‌ హౌస్‌లు, క్లాత్‌ బిజినెస్‌ నిర్వహిస్తోంది. గోడౌన్లు, బిల్డింగ్‌ల నిర్మాణానికి సంబంధించి పావులూరులో గోడౌన్‌, బిల్డింగ్‌ పనులను పూర్తి చేశారు. గుర్రపుశాల, బూదవాడ, సజ్జాపురం గ్రామాల్లో గోడౌన్లు, బిల్డింగ్‌ పనులు జరుగుతున్నాయి.

పెట్రోల్‌ బంకుల నిర్వహణ

ఆర్ధికంగా బలోపేతానికి జిల్లా సహకారశాఖ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 7 పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే అడుసుమల్లి (పర్చూరు మండలం), చెరుకూరు(యర్రగొండపాలెం మండలం) లో పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తోంది. మరో ఐదు పెట్రోల్‌ బంకులను ఇంకొల్లు, పావులూరు, భీమవరం, నూతలపాడు, పామూరులలో ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి.

సహకార సంఘాల్లో బహుళ సేవలు జిల్లాలో 12 జనరిక్‌ ఔషధ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు ఏడు పెట్రోల్‌ బంకులకుగానూరెండు బంకుల ఏర్పాటు ప్రతి సహకార పరపతి సంఘంలో కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ అందుబాటులోకి 250 రకాల సేవలు

సహకార రంగాన్ని సీఎం జగన్‌ బలోపేతం చేస్తున్నారు

సహకార రంగాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. సహకార రంగ అభివృద్ధి వలన గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. పంట ఉత్పత్తులపై ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నాం. సహకార రంగ సేవలు గ్రామీణ ప్రాంతాల వారికి మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం. – వై.ఎం.ప్రసాద్‌రెడ్డి, పీడీసీసీబీ చైర్మన్‌

మరిన్ని వార్తలు