ప్రజల హృదయాల్లో సుబ్బరామరెడ్డిది చెరగని స్థానం

2 Dec, 2023 01:24 IST|Sakshi

ఒంగోలు: జిల్లా ప్రజల హృదయాల్లో మాగుంట సుబ్బరామరెడ్డి చెరగని స్థానం సంపాదించుకున్నారని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం మాగుంట కుటుంబీకులు, మాగుంట అభిమానులు నిర్వహించిన మాగుంట సుబ్బరామరెడ్డి 28వ వర్ధంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, అభిమానులు పాల్గొని సుబ్బరామరెడ్డి చిత్రపటం వద్ద ఘన నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ 1991లో జిల్లాలో మాగుంట సుబ్బరామరెడ్డి రాజకీయాన్ని ప్రారంభించారని, తనతోపాటు అనేకమంది ఆయన శిష్యులం అని చెప్పారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాటర్‌ ట్యాంకుల ఏర్పాటు, వెనుకబాటును రూపుమాపేందుకు విద్యాసంస్థలను నెలకొల్పి ప్రజల దృష్టిలో మహనీయునిగా నిలిచారన్నారు. తనతోపాటు ఎంతోమంది యువకులను రాజకీయాల్లోకి ప్రోత్సహించారన్నారు. మాగుంట, తన కాంబినేషన్‌ విజయానికి చిహ్నం అని, ఈ దఫా కూడా తప్పకుండా విజయఢంకా మోగిస్తామని చెప్పారు. 28 సంవత్సరాలుగా ఇదే మైదానంలో ప్రతి ఏటా సంస్మరణ సభ, అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం మాగుంట కుటుంబానికే చెల్లిందన్నారు. ఆయన వారసత్వంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, వారి కుటుంబ సభ్యులు సుబ్బరామరెడ్డి ఆశయాలు కొనసాగిస్తూ ఉన్నారని, యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి పార్లమెంట్‌ సభ్యునిగా చేసిన సేవలు ఆయన గొప్ప మనస్సుకు నిదర్శనమన్నారు. ఇటువంటి వారు జీవితాంతం ప్రజల హృదయాల్లోనే ఉండిపోతారన్నారు. ఎస్పీ మలికాగర్గ్‌ మాట్లాడుతూ అనుకోని ఘటనలో దివంగత పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట సుబ్బరామరెడ్డితోపాటు ఆయన గన్‌మెన్‌ రత్నం ప్రాణాలు కోల్పోయారన్నారు. నాడు నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉండేదని, అయితే పోలీసుశాఖ తీసుకున్న ప్రత్యేక చర్యలు వల్ల నేడు నక్సలిజం ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి ప్రశాంత పరిస్థితులు నెలకొల్పినట్లు చెప్పారు. మాగుంట సుబ్బరామరెడ్డి, గన్‌మెన్‌ రత్నంల ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు.

ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పేదల కష్టాలను స్వయంగా గమనిస్తూ వారిని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతోనే విద్యా సంస్థలు నెలకొల్పారని, అపర భగీరధునిలా మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేశారని సుబ్బరామరెడ్డి సేవలను కొనియాడారు. రాష్ట్ర మార్కెటింగ్‌, సహకార శాఖల ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మాగుంట సుబ్బరామరెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. సొంత ధనాన్ని వెచ్చించి ఆదుకోవడంతోపాటు వెనుకబడిన ప్రకాశం జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, నగర మేయర్‌ గంగాడ సుజాత తదితరులు మాగుంట కుటుంబీకులతో కలిసి స్వయంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ ప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కసుకుర్తి ఆదెన్న, ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఈదర హరిబాబు, వైఎస్సార్‌సీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ మాదాసు వెంకయ్య, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు, ఒడా చైర్‌పర్సన్‌ సింగరాజు మీనాకుమారి, డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు మాదిగ, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అయినాబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్‌, చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు కఠారి శంకర్‌, గోలి తిరుపతిరావు, బెల్లం సత్యన్నారాయణ, కుప్పా రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మాగుంట విద్యా సంస్థల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్‌, సర్టిఫికెట్లు అతిథుల చేతులమీదుగా పంపిణీ చేశారు. మాగుంట సేవలపై నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఆయన సత్కరించారు.

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

మరిన్ని వార్తలు