ఎయిడ్స్‌ నిర్మూలనకు చర్యలు

2 Dec, 2023 01:46 IST|Sakshi

ఒంగోలు టౌన్‌:

యిడ్స్‌ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి జీజీహెచ్‌ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌తో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న అనేక కట్టడి చర్యల వలన ఎయిడ్స్‌, హెచ్‌ఐవీల విస్తరణ చాలా వరకు తగ్గిందని చెప్పారు. జిల్లాలో సాధారణ ప్రజల్లో 0.06 శాతం, గర్భిణుల్లో 0.01 శాతానికి గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. హెచ్‌ఐవీ ప్రబలకుండా ప్రభుత్వం తీసుకున్న లెట్‌ కమ్యూనిటీ లీడ్‌ కార్యక్రమాన్ని అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా హెచ్‌ఐవీ పూర్తిగా కనుమరుగవుతుందన్న విశ్వాసం ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే ఎయిడ్స్‌, హెచ్‌ఐవీకి కారణాలు, నివారణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించేందుకు కృషి చేయాలని, క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. సానుకూల ఆలోచనలతో అన్ని రంగాల్లో రాణించవచ్చన్నారు. హెచ్‌ఐవీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాల బారినపడి జీవితాలను నాశనం చేసుకోకుండా జాగ్రత పడాలని సూచించారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితులను ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటోందని చెప్పారు. హెచ్‌ఐవీ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి, జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్‌ అధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ఒంగోలు ఎంపీ మాగుంట

శ్రీనివాసులరెడ్డి

కలెక్టర్‌తో కలిసి అవగాహన

ర్యాలీ ప్రారంభం

మరిన్ని వార్తలు